అంకితభావంతో పనిచేయండి
అంకితభావంతో పనిచేయండి
Published Fri, Sep 8 2017 9:43 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
2018లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
18 ఏళ్లు నిండిన అందరినీ నమోదు చేయాలి
ఎన్నికల కేసుల సత్వర పరిష్కారం
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
ఏలూరు (మెట్రో):
2018లో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అంకితభావంతో చేపట్టాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో కలిసి 15 నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర దళాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సర్వీసు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 2018 ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కోసం చేపట్టిన చర్యలను భన్వర్‌లాల్ సమీక్షించారు. 2019 మే మాసంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విడత చేపట్టిన జాబితా సవరణ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ఏలూరు నగరంతో పాటు అర్బన్ లోకల్ బాడీ, జిల్లాలో నూతనంగా విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
ఎన్నికల సమయంలో కోర్టుల్లో నమోదైన కేసులను విశ్లేషించండి :
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టిన వారిపై నమోదైన కేసులను విశ్లేషించడంలో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలవాలని భన్వర్‌లాల్ సూచించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ రానున్న ఏడాది చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో మూడు ఎస్సీ, ఒకటి ఎస్టీలతో కలిపి మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయని, వీటిలో 28,76,166 మంది ఓటర్లుగా ఉన్నట్లు సెప్టెంబరులో జరిగిన స్పెషల్ డ్రైవ్ అనంతరం గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. జిల్లాలో 1819 ఏళ్ల వయస్సు ఉన్న యువ జనాభా అంచనా ప్రకారం 1,48,644 మంది ఉండగా వీరిలో ఇంతవరకూ 31836 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. జిల్లా జనాభాలో ప్రతి వెయ్యి మందిలో 699 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. 3132 పోలింగ్ కేంద్రాలున్నాయని వీటిలో ఎక్కువుగా ప్రభుత్వ స్కూల్ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు ఉన్నాయన్నారు. 2014 ఎన్నికల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి 200 కేసులు నమోదుకాగా 185 కేసుల విచారణ పూర్తయి ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి నమోదైన 18 కేసుల్లో 13 కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నమోదైన వివిధ కేసులకు సంబంధించి పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా రూపొందించి తద్వారా కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, ఎఎస్పీ వి.రత్న, డీఆర్‌ఓ కె.హైమావతి, భూసేకరణ ప్రత్యేకాధికారి భానుప్రసాద్, నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఆర్‌డీఓలు జీ.చక్రధరరావు, బి.శ్రీనివాసరావు, ఎస్.లవన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ఝాన్సీరాణి, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్లు వైవీ చౌదరి, అమ్మాజీ, జడ్పీ సీఈఓ, ఇన్‌ఛార్జి డీపీఓ డి.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement