ఆ అనుమానాలు పోవాలంటే... | Sakshi
Sakshi News home page

ఆ అనుమానాలు పోవాలంటే...

Published Wed, Apr 10 2024 3:44 AM

Sakshi Guest Column On Election Commission About EVMs

అభిప్రాయం

ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని భారత ఎన్నికల కమిషన్  చెబుతోంది. కానీ వీటిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. ఎన్నికలు అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా! ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందు సులువైన పరిష్కారం, వీవీప్యాట్‌ స్లిప్‌లను అందివ్వడం!! స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. నొక్కినదానికే పడిందని నిర్ధారించే వీవీప్యాట్‌ స్లిప్‌ వీరికి భౌతికంగా అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్‌ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి, సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి.

దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తూ (మార్చి 16, 2024) భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ చాలా ధీమాగా ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)లతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసినవని వివరించారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్‌ యూనిట్,కంట్రోల్‌ యూనిట్‌తో పాటు, వోటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రెయిల్‌ (వీవీప్యాట్‌) అనే మూడు భాగాలు ఉంటాయన్నది మనకు తెలుసు.

ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసు కునేందుకూ, ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నివృత్తికీ వీవీ ప్యాట్‌లు కీలకమవుతాయి. కానీ ఎన్నికల కమిషన్  మాత్రం ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకోలా చెప్పాలంటే వీటిపై అనుమానాలు రేకెత్త డమే తప్పన్న చందంగా మాట్లాడుతోంది. ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని, వీవీప్యాట్‌ స్లిప్పు లపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నది ఎన్నికల కమిషన్  వాదనగా ఉంది. 

నమ్మమంటే నమ్మాల్సిందేనా?
ఈవీఎంల దుర్వినియోగం అసాధ్యమని సీఈసీ చెబుతున్నా ఓటర్లలో చాలామందికి ఆ నమ్మకమైతే లేదు. ఈవీఎంలపై సందేహాలు వద్దు అని చెప్పేందుకు సీఈసీ తానే రాసిన ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ఆరోపణలపై ఈవీఎంలే స్వయంగా స్పందిస్తే ఎలా ఉంటుందో వివరించారు. ‘‘తీరని కోరికలకు అన్ని వేళల్లో అందరిపై దూషించడం సరికాదు. మీరేంటో మీరే నిరూపించుకోలేనప్పుడే ఈవీఎంలపై తప్పు మోపుతారు’’ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ‘తీరని కోరికలు’గా అభివర్ణించడంతోనే ఈవీఎంలు విశ్వసనీయ మైనవి అయిపోవు. ఎన్నికలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్  బాధ్యత పూర్తయినట్టూ కాదు. 

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నది ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం నిపుణులు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేదనీ, వాటిని నమ్మలేమనీ వీరందరూ పలు సందర్భాల్లో ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్  ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదు. ఈ ధోరణి అనుమానాలు మరిన్ని రెకెత్తేలా చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సంఖ్యలను అస్సలు ప్రశ్నించకూడ దన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్  ధోరణి. దేశ జనాభాలో 11 శాతం మంది మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనీ, గడచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారనీ నీతి ఆయోగ్‌ చెబుతోంది. పారదర్శకత ఏమాత్రం లేని నేపథ్యంలో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్  ఈవీఎంలపై చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న భరోసాలను ఎలా నమ్మగలరు?

ఎన్నికలు అందరి వ్యవహారం...
ఓటర్లు వేసిన ఓటును మార్చి చూపే అవకాశం కానీ, ఈవీఎంలు తప్పులు చేయడం కానీ అసాధ్యమని ఎన్నికల కమిషన్‌(ఈసీ) చెబు తోంది. కానీ చాలా కారణాల వల్ల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈవీఎంలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు సంబంధించి 2019 సాధారణ ఎన్నికల్లో సుమారు 373 నియో జకవర్గాల గణాంకాల్లో తీవ్రమైన తేడాలున్నట్లు ‘ద క్వింట్‌’ వెబ్‌సైట్‌ గుర్తించింది. ఈ విషయంపై సీఈసీ, ఈసీ స్పందన నాస్తి. ఎన్నికల తరువాత ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, ఆరోపణలు చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. తద్వారా మాత్రమే అది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్న భరోసా సామాన్యుడికి ఇవ్వగలదు. 

ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రమే ఈవీఎంల విశ్వసనీ యతపై సందేహాలు లేవనెత్తుతారు అని సీఈసీ చేసిన వ్యాఖ్య రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది... ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు శ్రమ చేయని వారు చెప్పే కుంటిసాకు అని చెప్పే ప్రయత్నం. రెండోది... ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మాత్రమే పరిమితమని చెప్పడం. రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో సర్వాధికారి పౌరుడే. ఈ ప్రజాస్వామ్య సర్వాధికారి సార్వభౌమత్వాన్ని తనకు నచ్చిన వ్యక్తికి దఖలు పరచడమే ఓటింగ్‌. ఈ పని జరగాలంటే ఎన్నికలు, ఓటింగ్‌ వ్యవస్థ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు... అలా జరిగినట్లు కనిపించాలి కూడా. 

అంతేకాదు... తాము వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా ఓటరుకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. ఓటింగ్, లెక్కింపు వ్యవస్థలు రెండూ కూడా ఓటరు ఎవరికి ఓటేశారో వారికే ఓటు పడిందని ధ్రువీకరించేలా పనిచేయాలి. వేసిన వెంటనే రికార్డు కావాలి. రికార్డు అయిన విధంగానే లెక్క కూడా తేలాలి. ఈవీఎం యంత్రాలపై ఈసీ నిఘా అనేది రెండు కారణాల వల్ల అంత నమ్మదగ్గదిగా అనిపించదు. మొదటిది ఈవీఎం యంత్రాలను ప్రభావితం చేయగలమని, లేదా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేలా చేయగలమన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ తగినంతగా ప్రయత్నించకపోవడం;ఓటర్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈసీ విశ్వసనీయత అనేది అతి నిమ్న స్థాయికి చేరడం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వివక్ష లేకుండా ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేకపోవడం వాటిల్లో ఒకటి మాత్రమే.  

ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు అనేందుకూ, నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అనేందుకూ ఆధారాలు లేవు. అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంతమాత్రాన జరిగినట్టూ కాదు. కానీ సాక్ష్యం లేకపోవడం అన్నది సంఘటనే జరగకపోవడం కాదు.

వీవీప్యాట్‌ స్లిప్‌ ఇవ్వాలి!
ఎన్నికల సమయంలో వ్యవస్థలు, వనరులన్నింటిపై పెత్తనం, అధికారం ఒక పార్టీదిగా ఉంటుంది. అందుకే ఓటింగ్‌ ప్రక్రియ సందర్భంగా అనుమానాలు, ఆరోపణలు వస్తూంటాయి. ఈవీఎంల విషయంలో ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే... తమ ఓటు రికార్డు అయ్యిందా, లేదా అన్నది. ఈ ఆందోళనకు సులువైన పరిష్కారం ఉంది. ఓటర్లకు వీవీప్యాట్‌ స్లిప్‌లను అందివ్వడం. ఓటరు తాను అనుకున్న పార్టీకే ఓటు పడిందని నిర్ధారించుకుంటే ఆ స్లిప్‌ను బాక్స్‌లో మళ్లీ వేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు.

ఆ తరువాత వీరికి భౌతికంగా వీవీప్యాట్‌ స్లిప్‌ అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్‌ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. గత ఏడాది డిసెంబరులో ఇండియా కూటమి కూడా ఇదే సూచన చేసింది. సుప్రీంకోర్టు విచా రణలోని అంశాల్లోనూ ఇది ఉంది. వీవీప్యాట్‌ స్లిప్స్‌ను లెక్కించి ఫలితాలను ప్రకటించడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరగవచ్చు కానీ... ఏడు దశల్లో నెలన్నర పాటు ఎన్నికలు జరగ్గా కానీ జాప్యం ఒకట్రెండు రోజులు ఫలితాలు వెల్లడించేందుకు అయితే నష్టమేమీ ఉండదు.

ఎ ఎల్‌ ఐ చౌగులే 
వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement