పింఛన్లు ఆగమాగం..
సాక్షి, హైదరాబాద్: ‘సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 31.67 లక్షల మందికి ప్రభుత్వం ప్రయోజనం క ల్పించింది. అయితే ఆయా యూనిట్ కార్యాలయాల్లో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు మార్చి 2013 వరకు అందిన దరఖాస్తుల సంఖ్య, అందులో ఆమోదించిన, తిరస్కరించిన వాటి వివరాల్లో స్పష్టత లేదు. మంజూరులో జాప్యానికి, తిరస్కరణకు గల కారణాలను కూడా సరిగా పేర్కొనలేదు..’ అని కాగ్ తమ నివేదికలో స్పష్టం చేసింది.
పింఛన్ చెల్లింపుల్లో స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రారంభించి ఐదేళ్లు దాటినా 66 శాతానికి మించి లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు అందించలేదని, దీంతో చెల్లింపుల్లో పార దర్శకత సాధించే లక్ష్యం పూర్తిస్తాయిలో నేరవేరలేదని కాగ్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో చెల్లింపు కాని నిధులను ప్రభుత్వానికి జమ చేయకపోవడం, పథకాన్ని అమలు చేసే సంస్థలు వినియోగ ధ్రువపత్రాలను అందజేయకపోవడం వంటి ఆర్థిక లోపాలను కాగ్ బహిర్గతం చేసింది. రికార్డుల నిర్వహణ పేలవంగానూ, అంతర్గత నిర్వహణ బలహీనంగానూ ఉందని... ఫలితంగా నిర్వహణ వ్యవస్థలో లోపాలకు, నష్టభయానికి అవకాశమిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది.
మగవారికి వితంతు పింఛన్లు..
మగవారికీ, భర్త జీవించి ఉన్న మహిళలకు వితంతు పింఛన్లు ఇచ్చినట్లు తమ పరిశీలనలో వెల్లడైనట్లు కాగ్ పేర్కొంది. వయస్సు నిర్ధారణ పత్రాలు లేకుండానే వృద్ధాప్య పింఛన్లు, ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ పింఛన్లు ఇచ్చినట్లు తేలిందని.. అర్హతలేనివారికి పింఛన్లు, దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం చేసిన సందర్భాల్లో అధికారులు రిమార్కులు రాయకపోవడం వం టి లోపాలు బయటపడ్డాయని తెలిపింది. సామాజిక పింఛన్ల డేటాబేస్ ప్రక్షాళన నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేందుకు తగిన ప్రాధాన్య త ఇవ్వాలని, అనర్హుల తొలగింపుతో పాటు అర్హుల ఎంపికను సరిచూసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.