రైలు ప్రయాణికుల కొత్త టెక్నిక్
రైలు ప్రయాణికుల కొత్త టెక్నిక్
Published Sat, Nov 12 2016 3:40 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
ముంబై: మొన్నటి వరకు చిన్ననోట్ల భారమైన ప్రయాణికులకు ఇప్పుడు రద్దు చేసిన పెద్ద నోట్లు తలనొప్పి తెప్పిస్తున్నాయి. దీంతో లోకల్ రైలు ప్రయాణికులు సాధ్యమైనంత తరకు వాటి పీడ వదిలించుకునేందుకు తమ తెలివి తేటలు ఉపయోగిస్తున్నారు. ఇదివరకు ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగించే వారు మాస, త్రైమాసిక సీజన్ పాస్‌లు పొందేందుకు ఆసక్తి కనబర్చేవారు. ఇప్పుడు ఏకంగా ఆరు నెలలు, సంవత్సరం సీజన్ పాస్‌లు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా లోకల్ రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద క్యూలను తగ్గించేందుకు స్మార్ట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది.
దీంతో మొన్నటివరకు అప్పుడప్పుడు ప్రయాణించే వారు (తమ అవసరాన్ని బట్టి) రూ.50 లేదా రూ.100 స్మార్ట్ కార్డులు రీచార్జ్ చేయించుకునేవారు. ఇప్పుడు అదే సామాన్య ప్రజలు రూ.500 లేదా రూ.1000 చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు రీచార్జ్ చేసుకుంటున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే, స్మార్ట్ కార్డులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రైల్వే టికెట్ల కౌంటర్ల వద్ద స్వీకరిస్తుండడంతో ప్రజల దృష్టి ఇటువైపు మళ్లింది. దీంతో పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని రద్దయిన రెండు, మూడు రోజుల్లోనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చింది.
రద్దయిన నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే బదులుగా రైల్వే టికెట్ల కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. పైగా రూ.100 రీచార్జ్ చేసుకుంటే 5 శాతం బోనస్‌గా లభిస్తుంది. అంటే ఐదు రూపాయల ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. రూ.10,000 రీచార్జ్ చేసుకుంటే రూ.500 బోనస్ లభిస్తుంది. దీంతో ప్రయాణికులు స్మార్ట్ కార్డు కొనుగోలుకు ఎగబడుతున్నారు. అందులో రీచార్జ్ చేసుకున్న డబ్బులు ఎటూ పోవు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు పెద్ద నోట్ల బెడదను వదిలించుకునేందుకు లోకల్ రైల్వే టిక్కెట్ కౌంటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Advertisement
Advertisement