యువ ఓటర్లకు స్మార్ట్ కార్డులు
- మార్చి తొలి వారంలో కొత్త ఓటర్లకు పంపిణీ
- ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో జారీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : కొత్తగా ఓటరు నమోదు చేయించుకున్న వారికి త్వరలోనే స్మార్ట్ ఓటర్ కార్డులు రానున్నాయి. మార్చి మొదటి వారంలోగా వీటిని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. 2013 నవంబర్ 18వ తేదీ నాటికి జిల్లాలో 30,76,585 మంది ఓటర్లున్నారు. ఆ తరువాత 1,43,149 మంది ఓటర్లు పెరిగారు. 18,19 ఏళ్ల వయసున్నవారు 51 వేల మంది నమోదు చేయించుకున్నారు. వీరికి తొలిదశలో స్మార్ట్‌ఓటరు కార్డులు రానున్నాయి. ప్రాధాన్యక్రమంలో మిగిలినవారికి తర్వాత అందజేస్తారు.
ప్రస్తుతం విశాఖ దక్షిణం, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో యువ ఓట ర్లకు కార్డులు వచ్చాయి. అధికారులు ఇప్పటికే వాటి పంపిణీ చేపట్టారు.
ఈనెలాఖరుకు అన్ని నియోజకవర్గాల్లో కొత్త యువ ఓటరు కార్డులు రానున్నాయి.
మార్చి తొలి వారం నాటికి కొత్త ఓటర్లందరికీ కార్డులు వస్తాయని, వెంటనే పంపిణీ చేస్తామని అధికారులంటున్నారు.
పాత ఓటర్లు మాత్రం లామినేటెడ్ ఓటరు కార్డులతోనే ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది.
కార్డులను ఇంటికి వచ్చి అధికారులు అందజేస్తారు.