లోక్‌సభ పరిధిలో ఎక్కువగా మహిళా ఓటర్లు
ఇంటింటా వారిని కలుస్తూ ఓట్ల అభ్యర్థన
మొదటి సారి ఓటేయనున్న యువతను ఆకర్షించేలా కసరత్తు
పోస్టల్, హోం ఓటింగ్ కూడా వన్ సైడ్ అయ్యేలా ప్రచారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.
పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..
రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.
పోలింగ్ శాతం పెరగాల్సిందే..
ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.
యువ ఓటర్లకు గాలం!
ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో
పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
ఆమే.. అధికం!
ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్‌లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.
ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment