కొత్తగూడెం, న్యూస్‌లైన్ : పింఛన్ పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌కార్డు వ్యవస్థతో పలువురు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్‌కార్డు కావాలంటే వేలిముద్రలు తప్పనిసరి కావడంతో కుష్టురోగులు, కొందరు వికలాంగులు వేలిముద్రలు వేసే వీలు లేకపోవడంతో ఆ కార్డులు రాలేదు. దీంతో వారికి నవంబర్‌లో రావాల్సిన పింఛన్ నిలిపివేశారు.
ఉదాహరణకు కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలో 127 మంది కుష్టు రోగులున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే రూ.500 పెన్షనే ఆధారం. అయితే స్మార్ట్‌కార్డు లేవనే సాకుతో ఈ నెల పింఛన్ నిలిపివేశారు. ఇలా ఎంతో మంది పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 31 వేల పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఈ నెలలో 28,384 మందికి మాత్రమే మంజూరయ్యాయి. మిగిలిన వారిని బినామీలుగా గుర్తించి రద్దు చేశారు. అయితే మంజూరైన వారిలోనూ స్మార్ట్‌కార్డులు లేవనే సాకుతో 12,900 మందికి ఈ నెల పింఛన్ ఇవ్వలేదు. వీరిలో ఎక్కువ మంది వికలాంగులే ఉండటం గమనార్హం. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌కార్డు నిబంధనతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఇలా పింఛన్‌పైనే ఆధారపడి జీవనం గడుపుతున్న పలువురు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. వేలిముద్రలు వేసేందుకు అసలు తమకు వేళ్లు లేవని, ఇలాంటి నిబంధనలు పెడితే తమ గతేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులకూ సక్రమంగా అందని పెన్షన్‌లు..
గతంలో ప్రభుత్వం పింఛన్ పంపిణీని జీరోమాస్ సంస్థ ద్వారా చేపట్టేది. ప్రతి నెల 31వ తేదీన పెన్షన్ డబ్బు తీసుకొచ్చే ఆ సంస్థ సిబ్బంది 1 నుంచి 5వ తేదీలోపు పింఛన్లను పంపిణీ చేసేవారు. కాగా, ప్రభుత్వం ఇటీవల మణిపాల్ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. అయితే తొలినెలలోనే 10వ తేదీ వరకు పింఛన్ పంపిణీ చేయలేదు. స్మార్ట్‌కార్డు ఉంటేనే పింఛన్ పంపిణీ చేయాలని, ఆ కార్డు లేకుంటే వారికి ఎన్‌రోల్‌మెంట్ చేసిన తరువాతే పింఛన్ పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, అందుకే పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని మణిపాల్ సంస్థ మేనేజర్ మణికుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అయితే చేతివేళ్లు లేని వారికి ప్రత్యేక కేటగిరి కింద స్మార్ట్ కార్డులు అందిస్తామని చెప్తున్న అధికారులు ఇప్పటివరకు ఈ ప్రక్రియ చేపట్టకపోగా స్మార్ట్ కార్డులకు పింఛన్లను అనుసంధానం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తమకు పింఛన్ అందేలా చూడాలని వికలాంగులు కోరుతున్నారు.
పింఛన్ ‘కట్’ కటా..
Published Fri, Nov 15 2013 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement