ప్రతిఒక్కరికీ స్మార్ట్ కార్డు! | smart cards similar to aadhar card | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరికీ స్మార్ట్ కార్డు!

Published Mon, Sep 29 2014 1:30 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

smart cards similar to aadhar card

 పాలమూరు: ఇకనుంచి ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డుల తరహాలోనే స్మార్ట్‌కార్డులు రానున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాలకు ఉపయోగించేవిధంగా రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం జిల్లాలో 9.85 లక్షల కుటుం బాలు, 42లక్షల జనాభా ఉన్నట్లుగా గుర్తించారు. సామాజిక జీవన స్థితిగతులను అంచనా వేసేం దుకు, సంక్షేమపథకాల అమలులో పారదర్శకత కోసం రాష్ట్రసర్కారు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది.

 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (విశిష్ట గుర్తింపు కార్డు) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పౌరుడికీ విశిష్ట ప్రయోజనాలున్న సరికొత్త స్మార్ట్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలుచేసే రేషన్ సరుకుల పంపిణీ మొదలు సామాజిక పింఛన్లు, విద్యార్థుల ఆర్థిక సాయం తదితర సంక్షేమ పథకాల ఫలాలను ఈ కార్డు ఆధారంగానే అందించేదిశగా చర్యలు తీసుకునేదిశగా అడుగులు వేస్తోంది.

 ప్రతి వ్యక్తికీ కార్డు..
 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ రేషన్‌కార్డుల ఆధారంగా కొనసాగుతున్నాయి. కొత్తగా సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చే క్రమంలోనూ రేషన్‌కార్డుల గణాంకాలే కీలకం. కానీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సంక్షేమఫలాలు చేరడంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టి కేవలం లబ్ధిదారుడికి మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ప్రస్తుతం కుటుంబానికి ఒక రేషన్‌కార్డు ఉండగా.. ఈ స్థానంలో ఇకపై ప్రతి వ్యక్తికి స్మార్ట్‌కార్డు ఇవ్వనున్నారు. దాదాపు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ తరహాలోనే ఈ స్మార్ట్ కార్డులు జారీచేయనున్నారు. జిల్లా యంత్రాం గంతో ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లకు సంబంధించి జిల్లా అధికారులు పలు సందేహాలను ప్రస్తావించగా.. ఆయన కొత్త స్మార్ట్‌కార్డుల అంశాన్ని వివరించారు.

 ఆధార్‌తో అనుసంధానం
 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్‌కార్డులతో బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారుడికి చేరాల్సిన సంక్షేమ ఫలాలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఖాతాలోకి చేరుతాయి. ఈ క్రమం లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్‌కార్డులు సైతం ఆధార్ కార్డుతో అనుసంధానమవుతాయి. స్మార్ట్‌కార్డులో ఆధార్ నంబర్‌తో పాటు సంబంధిత వ్యక్తి వివరాలను నిక్షిప్తం చేయనున్నారు.

ఇప్పటికే కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిం డర్ రాయితీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అన్ని సంక్షేమ పథకాలు స్మార్ట్ కార్డులు, ఆధార్ కార్డుల ద్వారా అమలైతే అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ స్మార్ట్ కార్డుల అంశానికి సంబంధించి మరింత స్పష్టత రానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement