సాక్షి, గుంటూరు: పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రాంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని.. అందుకే దాని పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారాయన.
‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం. వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం.
విప్లవాత్మక మార్పులు
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుంది. క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఆరోగ్య వివరాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం.
ప్రతీ ఇంట తప్పనిసరి
ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్నీ డాక్టర్లకు తెలుస్తాయి. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు. ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశాం. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం.
గత ప్రభుత్వంతో పోలిస్తే..
రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం. కాన్సర్‌లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్య శ్రీ వర్తింపజేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 104,108 వాహనాలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇవాళ ఏకంగా 104 ,108 కింద 2,200 వాహనాలు తిరుగుతున్నాయి. గతంలో మండలానికి ఒక 104,108 కూడా లేని పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితి. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. గత ప్రభుత్వం రూ.5 లక్షలు కూడా ఇచ్చేది కాదు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61శాతం ఉంటే.. రాష్ట్రంలో 3.3శాతం మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. వీటినికూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుంది. ఎప్పుడూ కూడా లేని విధంగా మార్పులు తీసుకు వస్తూ ముందడుగు వేస్తున్నాం.
ఆరోగ్య శ్రీని వినియోగించుకోవడంపై ప్రతీ సందేహాన్ని తీరుస్తూ ఆరోగ్య శ్రీకార్డులు ఇస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చాం. 1059 చికిత్సలకు మాత్రమే గతంలో ఆరోగ్య శ్రీ వర్తించేంది. ఇప్పుడు ఆ సంఖ్యను 3,257 చికిత్సలకు పెంచాం. పేదవాళ్లు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీని వర్తింపు చేశాం. చికిత్సల సంఖ్యను పెంచడం, ఆరోగ్య శ్రీ సేవలను ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం వరకూ ఉన్నవారికి వర్తింపు చేయడం, అలాగే రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని వర్తింపు చేయడం ఇవన్నీ కీలక మార్పులు. చికిత్స తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునేవారికి నెలకు రూ.5వేల చొప్పున ఆరోగ్య ఆసరా ఇచ్చాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,310 కోట్లు చెల్లించాం. ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స తీసుకున్నారు. పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లను ఉచితంగా చికిత్సలు అందించాం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1,897 కోట్లు ఖర్చు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. జాతీయస్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే, మన రాష్ట్రంలో సున్నా. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో వీరి కొరత సున్నా స్థాయికి తీసుకు వచ్చాం. నూటికి నూరుశాతం భర్తీచేశాం. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లోకి వెళ్తే మందులు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారాయన. అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి మందుకూడా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు మాత్రమే ఉండేట్టుగా అడుగులు వేశామన్నారాయన.
ప్రజలకు 562 రకాల మందులు అందుబాటులోకి తీసుకు వచ్చాం. ప్రివెంటివ్ కేర్‌ను విప్లవాత్మకంగా తీసుకురావడం జరిగింది. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా 10,032 విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 24 గంటల సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడ్డాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకు రావడం జరిగింది. మండలానికి నలుగురు డాక్టర్లను తీసుకురావడం జరిగింది. ఇద్దరు పీహెచ్‌సీల్లో ఉంటే, మరో ఇద్దరు ఫ్యామిలీ డాక్టర్ సేవలకు వెళ్తున్నారు. విలేజ్ క్లినిక్స్‌తో వీరు అనుసంధానం అయ్యారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపట్టాం. అని అన్నారాయన.
ఆరోగ్యశ్రీ కోసం వివరంగా చెప్పే కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం రేపటినుంచి నియోజకవర్గంలో 5 గ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, అలాగే ఆరోగ్య శ్రీపై ప్రచారం కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. దీని తర్వాత ప్రతి ఇంటికీ ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ కింద సేవలు ఎలా పొందాలన్నదానిపై వివరాలు చెప్పాలి. కనీసం ఒకరి ఫోన్లోనైనా ఆరోగ్య శ్రీయాప్‌ను డౌన్లో చేయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని తర్వాత ప్రతివారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున కార్డుల పంపిణీ, ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవాళ్లు, ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేకునేవాళ్లుకూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఎలాగూ ఈకార్యక్రమం జరుగుతుంది కాబట్టి, మహిళా పోలీసులుకూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేయాలి. ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. ఈ రెండూ కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమం గుర్తించిన రోగులకు సంబంధించి వారిని డేటా బేస్‌లోకి తీసుకు వచ్చి, వారికి సరిగ్గా చేయూత నిస్తున్నారా? లేదా? అని చూడాలి. డాక్టర్ రిఫరెల్, అంతేకాక వారికి కావాల్సిన మందులు అందుతున్నాయా? లేవా? అనే దానిపై సమీక్ష చేయాలి. ఉచితంగా మందులు కూడా డోర్‌డెలివరీ చేస్తున్నాం. జనవరి -1 నుంచి కూడా వారికి ఉచితంగా డోర్‌డెలివరీ ద్వారా అందుతాయి. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్ పంపితే వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోరీ నుంచి వారికి మందులు పోస్టుల్ సర్వీసుద్వారా విలేజ్ క్లినిక్‌కు అందుతాయి. అక్కడనుంచి ఆరోగ్య సిబ్బంది వారికి మందులను అందిస్తారు. రిఫరెల్ కేసులకు సంబంధించి ప్రయాణ ఖర్చుల కింద రూ.300లను ప్రభుత్వమే అందిస్తుంది. ఇవన్నీకూడా జగనన్న ఆరోగ్య సురక్ష-2లో భాగంగా చేపడతారు. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో హెల్త్ క్యాంపు జరుగుతుంది. ఈ పద్ధతిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు రిపీట్ అవుతుంది. ప్రతివారం మంగళవారం, శుక్రవారం ఈ క్యాంపులు జరుగుతాయి. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ప్రతి బుధవారం జరుగుతాయి:
ఆరోగ్య సురక్ష ఫేజ్-1ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాం. దాదాపుగా 60.27 లక్షల మంది సేవలు పొందారు. 2.4 లక్షల మందికి బీపీ లక్షణాలు కనిపిస్తే వారికి తిరిగి నిర్ధారణ చేశాం:
1.48 లక్షల మందికి సుగర్ ఉన్నట్టుగా కనిపిస్తే, నిర్ధారణ పరీక్షలు చేశాం. వీరికి మందులు కూడా ఇచ్చాం. నిర్ధారణ పరీక్షలు జనవరి 1 నాటికి పూర్తవుతాయి. ఇదికూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం.
ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై 6 నిమిషాల వీడియో కూడా మీ అందరి ఫోన్లకు పంపిస్తున్నాం. దీన్ని కుటుంబాలన్నింటికీ చూపించండి. వారిఫోన్లలో కూడా వీడియోను ఉంచండి అని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖకు, అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment