సాక్షి, అమరావతి: కాలేయ మార్పిడి, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డులు (క్యూఆర్ కోడ్‌తో సహా) జారీ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను గుర్తించామని, వాటిలో 716 చికిత్సలు అందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి వైద్యం తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో భాగంగా ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు, ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు, ఏఎన్‌ఎంల పాత్ర, టెలిమెడిసిన్ కాల్ సెంటర్ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.(చదవండి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్)
ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు
- ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఆస్పత్రి పూర్తి ప్రమాణాలు పాటించాలి.
- అదే విధంగా ఎన్‌ఏబిహెచ్ (నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్) గుర్తింపు పొందాలి.
- ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఆ గుర్తింపు పొంది ఉండాలి.
ఏఎన్‌ఎంల పాత్ర
- ఆరోగ్యశ్రీకి గ్రామాల్లో ఏఎన్‌ఎంలు రెఫరల్ పాయింట్, అందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలి, వ్యాధులపై అవగాహన కల్పించాలి.
- ట్యాబ్‌ల వినియోగంపై ఏఎన్‌ఎంలకు మరింత అవగాహన కల్పించాలి.
- అవసరమైతే రోగి దగ్గర వివరాలు తీసుకుని, టెలి మెడిసిన్ ద్వారా వైద్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పొందాలి.
- కోవిడ్‌కు సంబంధించి టెలి మెడిసిన్ కొనసాగుతోంది. అదే విధంగా ఇతర వ్యాధులకు సంబంధించి కూడా ఆ సదుపాయాన్ని విస్తరించాలి.
టెలి మెడిసిన్ కాల్ సెంటర్
- టెలి మెడిసిన్ కాల్ సెంటర్‌ను మరింత బలోపేతం చేయాలి.
- అక్కడ రోజంతా వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి.
- రోగులు, ఏఎన్‌ఎంలు ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ చేసే విధంగా ఉండాలి.
- ఇప్పుడు ఈ వ్యవస్థలో మిస్డ్ కాల్ ఇస్తే, కాల్ సెంటర్ వాళ్లు ఫోన్ చేస్తున్నారు కాబట్టి, రోగి నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి.
- ఆ వెంటనే కాల్ సెంటర్ కాల్ బ్యాక్ చేయాలి. 5 నిమిషాల్లోపు కచ్చితంగా ఆ ఫోన్ వెళ్లాలి.
- లేకపోతే దాని వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది.
- అన్ని చోట్ల ‘టు వే’ ఇంటరాక్షన్ సదుపాయం ఉండాలి. అందుకు అవసరమైన నెట్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి.
- అలా ఉంటే రోగిని టెలి మెడిసిన్ సెంటర్‌లో ఉండే వైద్యుడికి నేరుగా చూపించవచ్చు. తద్వారా వెంటనే వైద్య సహాయం చేయొచ్చు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు
- మంచి ఆహారం, డిశ్చార్జ్ తర్వాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా.. ఈ మూడు ఆరోగ్యశ్రీ పథకం ప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రులలో (ప్రభుత్వ ఆస్పత్రులు సహా) పక్కాగా అమలు కావాలి.
- అదే విధంగా ఆరోగ్యమిత్ర (హెల్ప్ డెస్క్)లు రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment