సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది.
రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?)
సందట్లో సడేమియా..
గత 3 సంవత్సరాలుగా స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment