ఒక్క బిల్లు.. 40 లారీలు | Granite danda of TDP MLAs | Sakshi
Sakshi News home page

ఒక్క బిల్లు.. 40 లారీలు

Published Thu, Oct 10 2024 6:06 AM | Last Updated on Thu, Oct 10 2024 6:06 AM

Granite danda of TDP MLAs

టీడీపీ ఎమ్మెల్యేల గ్రానైట్‌ దందా

ఆడియో లీకేజీతో బయటపడిన చీకటి బాగోతం

జీరో బిల్లులతో తరలిపోతున్న గ్రానైట్‌

ప్రభుత్వాదాయానికి గండికొట్టి జేబులు నింపుకుంటున్న ఎమ్మెల్యేలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ ఎమ్మెల్యేల గ్రానైట్‌ దందా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకే బిల్లు.. 40 లారీల తరలింపు అనే చందంగా సాగిపోతోంది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్‌ కంటైనర్లకు బిల్లు తప్పనిసరిగా చూపించాలి. అయితే.. ప్రతి కంటైన­ర్‌కు బిల్లు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ కింద రూ.40 వేలు చెల్లించాలి. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయ­కుల అండదండలతో ఒక కంటైనర్‌కు మాత్రమే బిల్లు చెల్లించి.. దానినే చూపిస్తూ సుమారు 40 కంటైనర్లను పొరుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. 

ఇలా తమిళనాడు, తెలంగాణకు రోజుకు 150కి పైగా కంటైనర్లు అక్రమంగా తరలిపోతున్నా­యని విశ్వస­నీయ సమాచారం. రోజూ అక్రమ రవా­ణాదారులు ఒక్కో కంటైనర్‌కు రూ.15 వేల లెక్కన.. టీడీపీ నేతలకు కప్పం కడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దలు జేబులు నింపు­కోవడం కోసం ప్రభుత్వ ఆదా­యా­నికి రూ.కోట్ల మేర గండి కొడుతు­న్నా­రని సొంత పార్టీలోనే విమ­ర్శలు వెల్లు­వె­త్తు­తు­న్నాయి.

ఆడియో లీక్‌తో బండారం బట్టబయలు
గ్రానైట్‌ అక్రమ రవాణాలో ఉమ్మడి ప్రకా­­శం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న వసూళ్ల వ్యవహారంపై బయటకొచ్చిన ఆడియో కల­కలం సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఓ ఎమ్మెల్యే రూ.కోట్లు సంపాదిస్తుంటే.. ఇంకో ఎమ్మెల్యే అంత­కంటే ఎక్కువ సంపాదిస్తున్నా­డని ఆ పార్టీ కార్యక­ర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 

జిల్లా నడి­బొ­డ్డున ఉన్న చీమకుర్తి నుంచి కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరుకు కొందరు వ్యాపారులు అక్రమంగా గ్రానైట్‌ను తర­లిస్తు­న్నారు. ఒంగోలు, సింగరాయకొండ మీదుగా కృష్ణపట్నం వైపు.. పొదిలి, మార్కాపురం, యర్రగొండపాలెంల మీదు­గా హైదరాబాద్‌ వైపు అక్రమ రవాణా సాగిపోతోంది. బేస్తవారిపేట జంక్షన్, రాచర్ల, గిద్దలూరు మీదు­గా బెంగళూరు తరలిస్తు­న్నారు. ఈ మూడు రహ­దారులపై టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు పట్టుబి­గించారు.  

రూట్లను వేలం వేసి మరీ..
ఒక్కో రూట్‌ను ఎమ్మెల్యే మనుషులు రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు వేలం నిర్వహించి మరీ పంచుకున్నారు. వేలం సొమ్మును ఎమ్మెల్యేకు ముట్ట­చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఆ మార్గాల్లో గ్రానైట్‌ తరలించాలంటే టీడీపీ ట్యాక్స్‌ చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మార్కా­పురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచ­రులు చీమకుర్తి కంపెనీల వద్ద గల లారీల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పేరు చెప్పి నగదు వసూలు చేయడం మొదలెట్టారు. 

ఈ విషయంలో  టీడీపీకే చెందిన మరో వ్యాపారి తాను కంపెనీకి బిల్లు చెల్లించానని, కనుక డబ్బులు ఇవ్వనని వారికి స్పష్టం చేశారు. దాంతో వారి మధ్య వివాదం చోటుచేసుకొంది. పొదిలి ఎస్సై వేమన, తాడివారిపల్లిలో బ్రహ్మనాయుడు, గిద్దలూ­రులో రామ­కోటయ్య, మార్కాపురంలో సుబ్బారావు ఉన్నా­­రని, ఎలాంటి ఇబ్బంది ఉండదని, బండి చేయి దాటి­పోతే మాత్రం విమానం ఎక్కిస్తానంటూ కందుల అనుచరులు బెదిరింపులకు దిగ­డం కల­కలం సృష్టించింది. 

ఈ మొత్తం వివాదాన్ని సదరు వ్యక్తి రికార్డు చేసి ఆడియో విడుదల చేయడంతో గ్రానైట్‌ రవాణాలో జీరో వ్యాపారం వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల ముసుగు తొలిగింది.

ఇతర ఎమ్మెల్యేలకూ వాటాలు
మార్కాపురం ఎమ్మెల్యే కందుల మాత్రమే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ దందాలో వాటాలు ముడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఒంగోలులో జరిగిన స్వర్ణాంధ్ర విజన్‌ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని గ్రానైట్‌ దందాపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై చిందులు తొక్కారు. 

కుక్కలు మొరుగుతుంటాయంటూ నోరుపారేసుకు­న్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఒక్కడు కూడా రాయలేదని ఎదురుదాడికి ప్రయత్నించారు. గ్రానైట్‌ అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement