
అటవీ అనుమతుల గుట్టు..గోపాలుడికే ఎరుక!
- అటవీ అనుమతులు లేక అనుప్పల్లి-పనబాకంరహదారి పనుల నిలిపివేత
- రూ.4.59 కోట్ల నాబార్డ్ నిధులు వెనక్కి
- పరదరామి, కీనాటంపల్లి రిజర్వు ఫారెస్టులో గ్రానైట్ తవ్వకానికి అటవీశాఖ అనుమతి!
- ఇద్దరు గ్రానైట్ వ్యాపారులు మంత్రికి సన్నిహితులు కావడం వల్లే అనుమతులు
- వచ్చాయంటున్న అధికారవర్గాలు..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ఆ శాఖ అనుమతించడం లేదు. కానీ.. అటవీ భూముల్లో నిక్షిప్తమైన సహజసంపదను బడా వ్యక్తులకు దోచిపెట్టడానికి మాత్రం ఆశాఖ తలుపులు బార్లా తెరుస్తోంది. రామచంద్రాపురం మండలంలో అనుప్పల్లి-పనబాకం రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. ఎంత ప్రయత్నించినా అటవీశాఖ అనుమతించకపోవడంతో చేసేదిలేక ఆ రోడ్డును రహదారులు, భవనాలశాఖ అధికారులు రద్దు చేశారు.
యాదమరి మండలంలో కీనాటంపల్లి, పరదరామి రిజర్వు అటవీ భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మాత్రం ఇద్దరు టీడీపీ నేతలకు ఆ శాఖ అనుమతి ఇచ్చేసింది. అటవీశాఖ మంత్రి బొజ్జలకు ఆ ఇద్దరు సన్నిహితు లు కావడం వల్లే అనుమతి ఇచ్చిందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించి, చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖను దక్కించుకున్నారు. అటవీ శాఖమంత్రి జిల్లాకు చెందిన నేతే కావడంతో ఆశాఖ అనుమతులు రాక ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగే అ వకాశం ఉందని అధికారవర్గాలు భావించాయి. ప్రజలూ అదే ఆశించారు. ఆ ఆశలను అటవీశాఖ అడియాశలు చేస్తోంది.
జనం ఆశలపై నీళ్లు..
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలంలోని ఆర్కే పల్లి రోడ్డు 0/0 కిమీ నుంచి 9/4 కిమీ వరకూ అనుపల్లి నుంచి గోకులాపురం మీదుగా పనబాకం వరకూ రోడ్డు నిర్మాణానికి ఆగస్టు 1, 2011న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు రూ.4.59 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. 9.4 కిమీల పొడవు ఉన్న రోడ్డును.. 4.30 కిమీల మేర రిజర్వు అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అనుపల్లి-పనబా కం రోడ్డు నిర్మాణం కోసం రహదారులు భవనాలశాఖ అధికారులు అటవీశాఖ అనుమతి కోసం ప్రయత్నించారు.
మూడేళ్లపాటు అటవీశాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ రహదారు లు, భవనాలశాఖ అధికారులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు అటవీశాఖ మంత్రి బొజ్జల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కానీ.. ఆ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు. దాంతో చేసేదిలేక ఆ రోడ్డు నిర్మాణాలను ఆపేశారు. పనులు చేసిన మేరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి.. తక్కిన నిధులను నాబార్డుకు వెనక్కి పంపాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబు ఆగస్టు 13న ఉత్తర్వులు(జీవో ఆర్‌టీ నెం: 618)ను జారీ చేశారు. ఇది అనుపల్లి, గోకులాపురం, పనబాకం గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
గ్రానైట్ వ్యాపారులపై ప్రేమ..
యాదమరి మండలం పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలోని 213 కంపార్ట్‌మెంట్‌లో 4.90 హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతించాలని టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్ జూన్ 14, 2007న దరఖాస్తు చేసుకుంది. అదే మండలంలో కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాం తంలోని 228 కంపార్ట్‌మెంట్‌లో ఏడు హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మరో టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్ జూన్ 7, 2008న దరఖాస్తు చేసుకుంది. రిజర్వు అటవీ భూముల్లో గనుల తవ్వకానికి ఆశాఖ అనుమతించలేదు.
ఏడేళ్లుగా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. కానీ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ శాఖ మంత్రి పదవి దక్కించుకోగానే ఆ ఇద్దరి నేతల ఫైళ్లు చకచకా కదిలాయి. కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో ఏడు హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తవ్వుకోవడానికి టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్‌కు అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 73) జారీచేశారు. ఇక మరో టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్‌కు పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలో 4.90 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 74) జారీచేశారు. ఏడేళ్లుగా అనుమతించని అటవీశాఖ ఇప్పుడు ఒక్కసారిగా తలుపులు బార్లా తెరవడం వెనుక మతలబేమిటన్నది గోపాలుడికే ఎరుక.