తరలిపోతున్న గ్రానైట్
తరలిపోతున్న గ్రానైట్
Published Mon, Aug 22 2016 7:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
* యథేచ్ఛగా ఖనిజ సంపద అక్రమ రవాణా
* రాత్రి వేళల్లో జిల్లా హద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు
* పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖాధికారులు
పాత గుంటూరు: జిల్లాలో గ్రానైట్ సంపద యథేచ్ఛగా అక్రమ రవాణాకు గురౌతోంది. రాత్రి వేళల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి స్వేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిలుకలూరి పేట, ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి నుంచి కోట్లాది రూపాయలు విలువ జేసే ఖనిజ సంపద ఎలాంటి వే బిల్లులు లేకుండా జిల్లా నుంచి అక్రమంగా తీసుకుపోతున్నారు. అరికట్టాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ళకు అలవాటుపడి నిద్ర నటిస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరిహద్దుల గుండా..
జిల్లాలోని మాచర్ల, పొందుగల తదితర జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌లు వున్నా అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అక్రమ రవాణాదారులు మామూళ్ళను సమర్పించుకుంటూ గ్రానైట్‌ను పక్క రాష్ట్రాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఏడు లోడు లారీల పట్టివేత..
గత నెలలో రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వెళ్తున్న 7 గ్రానైట్ లోడు లారీలను గుంటూరుకు చెందిన సీటీవో సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఒక్కరోజులోనే 7 గ్రానైట్ లోడు లారీలు పట్టుబడ్డాయంటే.. నెలనెలా ఎన్ని వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గట్టి నిఘా ఏర్పాటు చేశాం..
జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టడానికి గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.50 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశాం. అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు కూడా మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం.
– ఎం.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనరు, గుంటూరు – 2 డివిజన్
Advertisement
Advertisement