illegal transporting
-
‘రేషన్’కు రెక్కలు
సాక్షి, మెదక్ : అక్రమాలకు తావు లేకుండా ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తున్నా.. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పలువురు అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి పీడీఎస్ రైస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సివిల్ సప్లయీస్ శాఖ పట్టింపులేని తనం.. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం రేషన్ బియ్యం దందా జిల్లాలో మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు మూడు పూటలా అన్నం తినేలా రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేసే ఆహార భద్రత పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా దందా నడిపిస్తూ రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు మామూళ్ల ఎర.. జిల్లా పరిధిలోని 20 మండలాల్లో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ఆహార భద్రత కార్డులు 2,01,100 ఉండగా.. కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డులు 13,013 ఉండగా.. వారికి 35 కిలోలు ఇస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులు 84 మంది ఉండగా.. వారికి ఉచితంగా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతి నెలా 4,432.173 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. బియ్యం దొడ్డుగా ఉండడం, జీర్ణం కాకపోవడంతో చాలా మంది వాటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సిబ్బందిని నియమించుకుని పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ అధికారులు, సిబ్బందికి నెలవారీగా మామూళ్ల ఎర వేసి.. వారి అండదండలతో తమ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. దందా సాగుతుందిలా.. అక్రమార్కులు నియమించుకున్న వారు.. డబ్బు ఆశతో దళారులుగా మారిన కొందరు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలోకు రూ.ఏడు నుంచి రూ.ఎనిమిదితో కొనుగోలు చేసి.. ఓ చోట డంప్ చేస్తున్నారు. వారి స్థోమతను బట్టి వివిధ రకాల వాహనాల ద్వారా మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 మధ్యలో గానీ.. తెల్లవారు జాము నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో గానీ ఎంచుకున్న చోటుకు పంపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామం, మండలంలో రేషన్ సేకరించిన వారికి కిలోకు రూ.12 నుంచి రూ.15 సమకూరుతున్నాయి. పెద్దమొత్తంలో పీడీఎస్ రైస్ జమ అయిన తర్వాత లారీ, డీసీఎం వాహనాల్లో అక్రమార్కులు పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా తూప్రాన్ , నర్సాపూర్, మెదక్ పట్టణ శివారు ప్రాంతాల కేంద్రంగా పీడీఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలుతున్నట్లు సమాచారం. 50 శాతం మహారాష్ట్రకు.. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని డీలర్లు, లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యంలో సుమారు 50 శాతానికి పైగా మహారాష్ట్రకు తరలుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్, వీరూర్‌లో బియ్యం దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అక్కడ కిలో బియ్యానికి రూ.50 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. బియ్యానికి బదులుగా గోధుమలు, చక్కెర, తెల్ల జొన్నలు ఇస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. డీసీఎంలు, లారీల్లో రెండు, మూడు రోజులకోసారి అక్కడికి వేల క్వింటాళ్ల మేర రేషన్ బియ్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫలితం ఇవ్వని ఈ–పాస్. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. కార్డుదారుడు తన వేలిముద్ర పెడితే తప్ప బియ్యం ఇచ్చేందుకు అవకాశం లేదు. కొంతమంది వేలిముద్రలు పడుతలేవనే కారణంలో డీలర్లు మ్యానువల్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో డీలర్లు మాయ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మా దృష్టికి రాలేదు. అక్రమ బియ్యం సరఫరాను ఉపేక్షించేది లేదు. అలాంటి వాటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – సాధిక్, సివిల్సప్లై, డిప్యూటీ తహసీల్దార్, మెదక్ అక్రమార్కుల దందా ఇలా.. ► ఇంటింటా సేకరించే బియ్యం (కిలోకు) రూ.7 నుంచి రూ.8 ► మిల్లర్లు లేదా మాఫియాకు అమ్మకం (కిలోకు) రూ.12 నుంచి రూ.15 ► మహారాష్ట్రలో అమ్మగా వచ్చే సొమ్ము (కిలోకు) రూ.50 నుంచి రూ.65 -
హద్దులు దాటుతున్న గొర్రెలు
ఆదిలాబాద్‌రూరల్ : అవి టారస్, ఐచర్ (పెద్ద లారీలు) వాహనాలు.. కింద, పైన, మధ్యలో చెక్కలను స్లాబ్‌గా వేసి గొర్రెలను తరలిస్తున్నారు.. ఒక్కో టారస్ వాహనంలో 300 గొర్రెలు.. ఇలా రెండు టారస్ వాహనాల్లో, రెండు ఐచర్ వాహనాల్లో మొత్తం వెయ్యి గొర్రెలను సరిహద్దు దాటిస్తుండగా జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలుగా అనుమానించిన ఆర్టీఏశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని ఆదిలాబాద్‌రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పశు సంవర్ధకశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అవి సబ్సిడీ గొర్రెలుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గం గాధర్ గ్రామం నుంచి నాలుగు భారీ లారీల్లో తరలిస్తున్నారనే వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రాంపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై పట్టుకున్నారు. గొల్లకుర్మలకు రూ.1లక్ష 25వేల వ్యయంతో 21 గొర్రెలను పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది దళారులు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాటిని చెవులకు వేసిన ట్యాగ్‌ను తొలగించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తున్న గొర్రెలు సుమారు వెయ్యి వరకు ఉంటాయని సంబంధిత శాఖాధికారులు, పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఈ గొర్రె యూనిట్ల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పట్టుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగించామని ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులు దొరికినప్పుడే వీటి పూర్తి వివరాలను బయటపడతాయన్నారు. లారీలను సీజ్ చేసి, గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
తరలిపోతున్న గ్రానైట్
* యథేచ్ఛగా ఖనిజ సంపద అక్రమ రవాణా * రాత్రి వేళల్లో జిల్లా హద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు * పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖాధికారులు పాత గుంటూరు: జిల్లాలో గ్రానైట్ సంపద యథేచ్ఛగా అక్రమ రవాణాకు గురౌతోంది. రాత్రి వేళల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి స్వేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిలుకలూరి పేట, ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి నుంచి కోట్లాది రూపాయలు విలువ జేసే ఖనిజ సంపద ఎలాంటి వే బిల్లులు లేకుండా జిల్లా నుంచి అక్రమంగా తీసుకుపోతున్నారు. అరికట్టాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ళకు అలవాటుపడి నిద్ర నటిస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దుల గుండా.. జిల్లాలోని మాచర్ల, పొందుగల తదితర జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌లు వున్నా అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అక్రమ రవాణాదారులు మామూళ్ళను సమర్పించుకుంటూ గ్రానైట్‌ను పక్క రాష్ట్రాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడు లోడు లారీల పట్టివేత.. గత నెలలో రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వెళ్తున్న 7 గ్రానైట్ లోడు లారీలను గుంటూరుకు చెందిన సీటీవో సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఒక్కరోజులోనే 7 గ్రానైట్ లోడు లారీలు పట్టుబడ్డాయంటే.. నెలనెలా ఎన్ని వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టడానికి గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.50 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశాం. అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు కూడా మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. – ఎం.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనరు, గుంటూరు – 2 డివిజన్ -
ఖనిజం అక్రమ రవాణా
ఆలస్యంగా వెలుగుచూసిన అక్రమార్కుల దోపిడీ బొల్లాపల్లి: ముడి ఖనిజం అక్రమ తరలింపు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్లవిలువ జేసే లెడ్ జింక్ ముడి సరుకు అక్రమ రవాణాకు అక్రమార్కులు నడుం బిగించారు. పాలకపార్టీ నాయకుల అండదండలతో స్థానిక నాయకులు ఈ అక్రమ దోపిడీకి శ్రీకారం చుట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో బండ్లమోటు మైనింగ్ 1965లో ప్రారంభమైంది. అనంతరం నష్టాబాటలో ఉన్న కంపెనీ 2002లో మూతపడింది. అప్పట్లో కొన్ని వేల టన్నులు ముడి సరుకు మైనింగ్ పక్కనే పడిఉంది. వేల కోట్ల విలువచేసే ఈ రాయి అక్రమ రవాణాపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. 2013తో మైనింగ్ లీజ్ రద్దవడంతో ఈ ప్రాంతమంతా అటవీ శాఖ అదీనంలోకి వచ్చింది. టిడిపి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి కొందరు వచ్చి పరిశీలించి వెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. గత రెండు నెలలుగా క్వారీ ప్రాంతం నుంచి రెండు ధపాలుగా ముడి సరుకు అక్రమంగా తరలివెళ్లిందని, ఈ సరుకు అక్రమ తరలింపు అటవీ శాఖాధికారుల కనుసన్నల్లో జరిగిందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. టిప్పర్లను అడ్డుకున్న యువకులు.. గురువారం తెల్లవారుజామున ఆరు టిప్పర్లు, పెద్ద ప్రోక్లెయినర్ బండ్లమోటు మైనింగ్‌లోకి ప్రవేశించి అక్రమంగా తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి టిప్ఫర్లును అడ్డుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు సిబ్బంది సంఘటన ప్రాంతానికి చెరుకొని వాహనాల వివరాలు సేకరించారు. నిబందనల ప్రకారం అర్ధరాత్రివేళ అటవీ సంపదను కొల్లగొడుతున్న వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వాహనాలు సంఘటన ప్రాంతం నుంచి వెళ్లిపోవడం, పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమంగా తరలించిన ముడిసరుకు పక్కనే ఉన్న రేమిడిచర్ల గ్రామానికి సమీపంలోని దంతెలకుంట పోలాల్లో నిలువచేశారు. సుమారు వంద టన్నుల ముడిసరుకు అక్రమంగా తరలివెళ్లినట్లు తెలుస్తుంది. టన్ను ముడి సరుకు విలువ సుమారు లక్షన్నర వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. స్థానిక యువకులు అడ్డగించడంతో ఈవిషయం వెలుగుచూసింది. మూసివేసిన మైనింగ్ నుంచి సరుకు రవాణాకు దట్టంగా మెలచిన అటవీ ప్రాంతంలోని కలపను నరికివేసి దారి ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ తరలింపు వెనుక పెద్దల హస్తం..? ఉన్నత స్థాయి పాలనా యంత్రాంగం అండదండలతో అక్రమంగా తరలివెళ్తోందని, ముడిసరుకును కడప జిల్లాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు. కోట్ల అటవీ సంపదను అక్రమార్కుల నుంచి కాపాడాలని బండ్లమోటు గ్రామస్తులు కోరుతున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చంద్రగిరి మండలం మూలపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వ్యాన్‌లో 36 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి బస్సులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గురువారం ఉదయం పాల్వంచలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.