పోలీసులు స్వాధీనం చేసుకున్న గొర్రెలు
ఆదిలాబాద్‌రూరల్ : అవి టారస్, ఐచర్ (పెద్ద లారీలు) వాహనాలు.. కింద, పైన, మధ్యలో చెక్కలను స్లాబ్‌గా వేసి గొర్రెలను తరలిస్తున్నారు.. ఒక్కో టారస్ వాహనంలో 300 గొర్రెలు.. ఇలా రెండు టారస్ వాహనాల్లో, రెండు ఐచర్ వాహనాల్లో మొత్తం వెయ్యి గొర్రెలను సరిహద్దు దాటిస్తుండగా జాతీయ రహదారిపై పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలుగా అనుమానించిన ఆర్టీఏశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని ఆదిలాబాద్‌రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పశు సంవర్ధకశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అవి సబ్సిడీ గొర్రెలుగా అనుమానిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా గం గాధర్ గ్రామం నుంచి నాలుగు భారీ లారీల్లో తరలిస్తున్నారనే వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రాంపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై పట్టుకున్నారు. గొల్లకుర్మలకు రూ.1లక్ష 25వేల వ్యయంతో 21 గొర్రెలను పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది దళారులు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాటిని చెవులకు వేసిన ట్యాగ్‌ను తొలగించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తున్న గొర్రెలు సుమారు వెయ్యి వరకు ఉంటాయని సంబంధిత శాఖాధికారులు, పోలీసులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న ఈ గొర్రె యూనిట్ల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పట్టుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగించామని ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులు దొరికినప్పుడే వీటి పూర్తి వివరాలను బయటపడతాయన్నారు. లారీలను సీజ్ చేసి, గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment