quaries
-
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్‌నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే అనుచరుల క్వారీలపై విజిలెన్స్ దాడులు
సాక్షి, ప్రకాశం : అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులకు చెందిన బల్లికురవ మండలంలోని క్వారీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపారు. శనివారం ఉదయం కొనిదెన రెవెన్యూ పరిధిలోని ఈర్లకొండ వద్ద ఉన్న మూడు క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కిషోర్, గంగాభవాని, అంకమ్మ చౌదరిలకు చెందిన క్వారీలలో రికార్డులు, పద్దులను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో ఆ శాఖ డీఐజీ వెంకటరెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. -
ఇసుక క్వారీలపై అధికారుల ఆకస్మిక దాడులు
వర్ధన్నపేట టౌన్ : ఇన్నాళ్లు ఆకేరువాగు ఒడ్డున యథేచ్ఛగా ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు బుధవారం ఏడు క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు ఆధ్వర్యంలో వరంగల్, హన్మకొండ, రాయపర్తి తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవి, మూర్తితోపాటు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, రాయపర్తి, జఫర్గడ్ ఎస్సైలు శ్రీధర్, సంపత్, ప్రొబేషనరీ ఎస్సై వెంకటకృష్ణ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు ఒడ్డున గాడిపెల్లి రాజేశ్వర్‌రావుకు చెందిన యంత్రసామగ్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇల్లంద శివారులో కమ్మగోని ప్రభాకర్, సోల్తి రాజబాబు, సోల్తి రాంబాబు, సోల్తి ఉప్పలయ్య, తాళ్లపెల్లి సాంబరాజు ఇసుక క్వారీలు నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను విక్రయిస్తున్నారని వర్ధన్నపేట తహసీల్దార్ కనకయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏడుగురిపై దొంగతనం కేసు నమోదు చేశారు. దాడులు జరుగుతున్నపుడు చిక్కిన మూడు ట్రాక్టర్ల ను సీజ్ చేసి, యజమానులపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
తరలిపోతున్న గ్రానైట్
* యథేచ్ఛగా ఖనిజ సంపద అక్రమ రవాణా * రాత్రి వేళల్లో జిల్లా హద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు * పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖాధికారులు పాత గుంటూరు: జిల్లాలో గ్రానైట్ సంపద యథేచ్ఛగా అక్రమ రవాణాకు గురౌతోంది. రాత్రి వేళల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి స్వేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిలుకలూరి పేట, ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి నుంచి కోట్లాది రూపాయలు విలువ జేసే ఖనిజ సంపద ఎలాంటి వే బిల్లులు లేకుండా జిల్లా నుంచి అక్రమంగా తీసుకుపోతున్నారు. అరికట్టాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ళకు అలవాటుపడి నిద్ర నటిస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దుల గుండా.. జిల్లాలోని మాచర్ల, పొందుగల తదితర జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌లు వున్నా అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అక్రమ రవాణాదారులు మామూళ్ళను సమర్పించుకుంటూ గ్రానైట్‌ను పక్క రాష్ట్రాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడు లోడు లారీల పట్టివేత.. గత నెలలో రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వెళ్తున్న 7 గ్రానైట్ లోడు లారీలను గుంటూరుకు చెందిన సీటీవో సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఒక్కరోజులోనే 7 గ్రానైట్ లోడు లారీలు పట్టుబడ్డాయంటే.. నెలనెలా ఎన్ని వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టడానికి గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.50 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశాం. అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు కూడా మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. – ఎం.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనరు, గుంటూరు – 2 డివిజన్