
వండువ కొండపై గ్రానైట్ బాంబు !
ఓ మాజీ ప్రజాప్రతినిధి, బినామీలుగా వ్యవహరిస్తున్న కొంతమం ది అధికార పార్టీకి చెందిన ఛోటా నాయకులు తమ స్వార్థం కోసం పచ్చని పొలాల్లో క్వారీ చిచ్చు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లోని పంటలకు ముప్పు కలిగించేందుకు బరి తెగిస్తున్నారు. 50 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ఉపరితల ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతున్నారు. సుమారు 350 మంది సరస్వతీ పుత్రులకు విద్యనందిస్తున్న ఉన్నత పాఠశాలకు, 2,500 మంది జనాభా కలిగిన గ్రామాలపై గ్రానైట్ బాంబు విసరాలని చూస్తుండడంతో జనం భయూందోళన చెందుతున్నారు. ప్రజలు, పర్యావరణ వేత్తల అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతరు చేస్తూ వీరఘట్టం మండలం వండువ కొండను గ్రానైట్ లీజు పేరిట కొల్ల గొట్టాలని నేతల పన్నాగం పన్నుతున్నారు.
- వీరఘట్టం
పరిస్థితి ఇది : సర్వే నెంబరు 185పై ఉన్న వండువ కొండపై రూ.35 కోట్లు వ్యయంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. దీని ద్వారా వీరఘట్టం మండంలోని 50 గ్రామాలకు కొద్ది రోజుల్లో తాగునీరు అందనుంది. అలాగే కొండకు ఆనుకొని ఉన్న వండువ గ్రామంలో 2500 మంది జనాభా నివసిస్తున్నారు. పక్కనే ఉన్నత పాఠశాల, మరో పక్క అడారు కాలనీ, కొండ చుట్టూ సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు, రూ.5 లక్షలతో నిర్మించిన క్రైస్తవ దేవాలయం ఉంది. కొండను లీజుకి ఇస్తే వీటి భవిష్యత్ ప్రమాదంలో పడనుంది.
ఇదీ విషయం : ఓ మాజీ ప్రజాప్రతినిధి గ్రానైట్ లీజుల కోసం ప్రయత్నిన్నారు. దీంతో వండువ కొండపై గతంలో అధికారులు గుట్టుగా సర్వేలు జరిపారు. కొండకు ఆనుకొని ఉన్న గ్రామం, ఉన్నత పాఠశాల, చుట్టూ సాగవుతున్న పొలాలు, కొండపై సాగవుతున్న జీడి, మామిడి తోటలు, సాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరింగుల ఫొటోలు సేకరించారు. వీటితో పాటు కొండ వద్ద వన్యప్రాణులు సైతం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ వాస్తవ పరిస్థిని ప్రభుత్వానికి నివేదిస్తాని అప్పట్లో ప్రకటించారు. అయితే సర్వే చేసిన అధికారులు వాస్తవాలను విస్మరించి తప్పుడు నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారనే విమర్శలు వస్తున్నారుు.
30న ప్రజాభిప్రాయ సేకరణ
సర్వే నెంబరు 185లో సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వండువ కొండ లీజు విషయమై ఈనెల 30న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి గ్రామసభ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వండువ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో లోలోపల అధికారులు కుమ్మకై అక్రమ లీజుకు యత్నిస్తున్నారని గ్రామస్తులంటున్నారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని, లేకుంటే ఆమరణ నిరాహరదీక్షకు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
స్థానికుల ఆందోళన
కొద్ది కాలంగా మౌనంగా ఉన్న వండువ కొండ లీజు వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొండే జీవనాధారం కావడంతో గ్రానైట్ లీజు విషయం తెలిసినప్పటి నుంచి పేదలు ఆందోళనకు గురవుతున్నారు. కొండను లీజు పేరిట ఎవరికైనా ధారదత్తం చేస్తే కుటుంబాలతో సహా వలసలు పోవాల్సిందేనని వాపోతున్నారు. కొండను రక్షించుకునేందుకు ప్రాణత్యాగాలకైనా, ఆమరణ నిరాహరదీక్షలకైనా సిద్ధమంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిలిపి వేసి అక్రమ లీజును నిలుపుదల చేయాలని గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు.