పర్మిట్ల జారీకి చేయి తడపాల్సిందే!
Published Wed, Aug 14 2013 4:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
టెక్కలి, న్యూస్‌లైన్ : ‘గ్రానైట్ లీజుదారులకు పర్మిట్లు జారీలో మైన్స్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెళియాపుట్టి మండలం గోకర్ణపురం క్వారీయింగ్‌కు సంబంధించి పర్మిట్లు జారీలో చేసిన జాప్యంపై సదరు లీజుదారులు సోమవారం రాత్రి ఆత్యహత్యాయత్నానికి పాల్పడి, ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయంలో అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యింది.
ఇటీవల కొందరు సిబ్బంది, అధికారులు కలిసి లీజుదారుల నుంచి వివిధ రకాలుగా వేలాది రూపాయలు అక్రమంగా దోచుకోవడం, ప్రభుత్వ ఆదాయానికిగండి పెడుతున్న వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. తాజా ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయ వ్యవ హారాలు మరోసారి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టిలో పడ్డాయి. గ్రానైట్ లీజుదారులకు సకాలంలో పర్మిట్లు జారీ చేయడంలో సిబ్బంది మామూళ్ల వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి.
పర్మిట్ల జారీలో క్యూబిక్ మీటర్‌కు ఒక్కో రేటు చొప్పున వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు లీజుదారులే బాహాటంగా ఆరోపిస్తున్నారు. పర్మిట్ల జారీలో జాప్యం చేయడంతో లీజుదారులపై బయ్యర్ల ఒత్తిడి పెరగడంతో అడిగిన లంచాల ను ఇస్తారనే ఏకైక కారణంతో మైన్స్ కార్యాలయ అధికారులు పర్మిట్ల జారీ ప్రక్రియను జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రావాల్సిన రెండు వేల రూపాయల రాయల్టీకి గండి పడుతోంది. నెలలో ఒక్క టెక్కలి డివిజన్‌లో ఉన్న 187 క్వారీల నుంచి సుమారు ఆరు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రవాణా జరుగుతాయి. పర్మిట్లు నిలిపి వేసినా, ప్రభుత్వాదాయానికి గండిపడిన మొత్తం లక్షల్లోనే ఉంటుంది. సోమవారం జరిగిన ఘటనతో లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
వివరణ కోరిన జిల్లా కలెక్టర్..!
సోమవారం రాత్రి గోకర్ణపురం క్వారీ లీజుదారులతో మైన్స్ ఏడీ ప్రసాద్ చేసిన వివాదాంశం చర్చనీయాంశమైంది. ఈ మేరకు మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ తీవ్రంగా స్పందించి ఏడీని వివరణ కోరారు. దీంతో ఉదయాన్నే ఆయన కలెక్టర్‌ను కలిసి పరిస్థితిపై పూర్తి వివరణిచ్చినట్లు తెలిసింది. అక్కడ ఏమి జరిగిందోగాని టెక్కలి కార్యాలయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లీజుదారులైన ధనుంజ యరెడ్డి, మురళీకృష్ణలను పిలిపించుకున్న ఏడీ, వారికి వెంటనే పర్మిట్లు జారీ చేశారు. ఈ విషయం ధ్రువీకరణ కోసం ‘న్యూస్‌లైన్’ ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఏడీ ప్రసాద్ అందుబాటులోకి రాలేదు. లీజుదారుడు ధనుంజయరెడ్డి మాత్రం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తనకు మంగళవారం మధ్యాహ్నం కార్యాలయానికి పిలిపించి ఏడీ పర్మిట్లు ఇచ్చారని అంగీకరించారు.
Advertisement