తళుకులపై మరకలు! | Granite Works in Charminar Places Hyderabad | Sakshi
Sakshi News home page

తళుకులపై మరకలు!

Published Fri, Aug 23 2019 11:48 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

Granite Works in Charminar Places Hyderabad - Sakshi

రోడ్డుపై పడవేసిన హోటల్‌ వ్యర్థాలు , చార్మినార్‌– మక్కా మసీదు పరిసరాల్లో గ్రానైట్‌ రోడ్లు

చార్మినార్‌: కాలిబాట పథకం పనుల్లో (చార్మినార్‌ పెడస్ట్రీయన్‌ ప్రాజెక్టు– సీపీపీ) భాగంగా రూ.35 కోట్లతో చేపట్టిన గ్రానైట్‌ పనులతో చార్మినార్‌ పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. గుల్జార్‌హౌజ్‌– చార్మినార్, చార్మినార్‌– సర్దార్‌ మహల్‌ భవనం, మక్కా మసీదు– చార్మినార్,చార్మినార్‌– లాడ్‌బజార్‌ వరకు ప్రధాన రహదారులన్నింటినీ గ్రానైట్‌ పనులతో అందంగా తీర్చిదిద్దారు. చార్మినార్, మక్కా మసీదు రోడ్డులో చేపట్టిన గ్రానైట్‌ అభివృద్ధి పనులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్రానైట్‌ రోడ్డు అందుబాటులోకి వచ్చిన వెంటనేచార్మినార్‌– మక్కా మసీదు కట్టడాల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు నో ఎంట్రీ విధించారు. చార్మినార్‌ కట్టడానికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. చార్మినార్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అందుబాటులోకి తేచ్చారు. వాహనదారులు చార్మినార్‌– మక్కా మసీదు రోడ్డు ద్వారా వెళ్లడం లేదు. అందమైన గ్రానైట్‌ రోడ్డుతో పాటు వాహనాల రాకపోకలు లేకపోవడంతో చార్మినార్‌– మక్కా మసీదు రోడ్డులో విశాలంగా ఖాళీ స్థలం ఏర్పడింది. దీంతో దేశ, విదేశాల పర్యాటకులు చార్మినార్‌– మక్కా మసీదును సందర్శించడానికి వచ్చినప్పుడు రిలాక్స్‌గా ఫీల్‌ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్ఫీలు దిగితూ సందడి చేస్తున్నారు.  

సహజత్వం కోల్పోతున్న గ్రానైట్‌ రోడ్లు..
కొంత కాలంగా ఇక్కడి టిఫిన్‌ సెంటర్‌లు, హోటళ్లలోని వ్యర్థాలను గ్రానైట్‌ రోడ్డుపై వేస్తుండడంతో ఆయా పరిసరాలు అపరిశుభ్రతతో కనిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ లోపం కారణంగా గ్రానైట్‌ రోడ్ల సహజత్వం దెబ్బతింటోంది. జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి రోజు చార్మినార్‌–మక్కా మసీదు రోడ్లలో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఉత్సవాలు, పండగ వేళల్లో చార్మినార్, చార్‌కమాన్, మక్కా మసీదు, సర్దార్‌ మహల్‌ రోడ్డు, లాడ్‌బజార్‌ రోడ్లను నీటితో శుభ్రంగా కడుగుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు చెత్త చెదారం మాత్రమే తొలగిపోతోంది తప్ప.. హోటల్‌ వ్యర్థాలతో పాటు మురుగునీటి నిల్వతో గ్రానైట్‌ రోడ్లు సహజ రంగును కోల్పోతున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రమైన చార్మినార్‌ వద్ద నిరంతర పర్యవేక్షణ అవసరమని సందర్శకులు కోరుతున్నారు.

వాటర్‌ గన్స్‌తో శుభ్రపరుస్తాం..
కొన్ని వ్యర్థాలను స్థానిక వ్యాపారులు గ్రానైట్‌ రోడ్డుపై వేస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ కొంత మందికి అవగాహన కల్పించాం. వినిపించుకోని వారికి చలానాలు సైతం విధించాం. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వాటర్‌ గన్స్‌ ద్వారా గ్రానైట్‌ రోడ్లను కడిగిస్తాం. ఇప్పటికే అవసరమైన పరికరాలను ఖరీదు చేశా. కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది.– బి.శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement