రోగాలొచ్చె | diseases in chimakurthy | Sakshi
Sakshi News home page

రోగాలొచ్చె

Published Tue, Nov 19 2013 5:48 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

diseases in chimakurthy

 చీమకుర్తి, న్యూస్‌లైన్:  నిధులు లేక అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలున్నాయి. కానీ ఏటా వందల కోట్ల ఆదాయం ఆ ప్రాంతం నుంచి వస్తున్నా.. అక్కడి ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రానైట్ ఖిల్లాగా ప్రసిద్ధిగాంచిన చీమకుర్తి ప్రాంతం నుంచి గత 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ సంపద దేశ, విదేశాలకు తరలిపోయింది. దీని ద్వారా ప్రభుత్వాధీనంలో ఉన్న మైన్స్ డిపార్టుమెంట్‌కు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక గ్రానైట్ యజమానులైతే కోటానుకోట్ల ఆదాయం గడించారు. కానీ స్థానికులకు ఒరిగింది  మాత్రం ... అక్షరాలా శూన్యం.
 ఎందుకూ పనికిరావనుకున్న భూముల్లో..
 1983కు పూర్వం రామతీర్థం పరిధిలో ఎందుకూ పనికిరావనుకుంటున్న భూముల్లో సిరులు కురిపించే గ్రానైట్ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓబచెత్త తప్ప ఏమీ పండని ఆ భూములను ఖాళీగా ఉంచడం ఎందుకని సంతనూతలపాడుకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వేమా యల్లయ్య పశువుల క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. తీరా దానిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉందని గమనించిన తర్వాత అందరి చూపు అటువైపు మళ్లింది. 1983లో ఒకే ఒక్క లీజుతో 8.094 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రానైట్ రాయిని వెలికి తీసేందుకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదటిసారి మైన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆ సంవత్సరం  రాయల్టీ రూపంలో రూ 11,015 ఆదాయం వచ్చింది. అది మొదలు 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు పారిశ్రామికవేత్తలు గ్రానైట్‌ను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రస్తుతం 510 హెక్టార్లలో దాదాపు 160 గ్రానైట్ లీజులతో విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు 33,67,005 క్యూబిక్ మీటర్ల బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీశారు.  
 ఏటా 4 లక్షల క్యూబిక్ మీటర్ల
 రాయి ఎగుమతి..
 రామతీర్థంలోని క్వారీలకు మాత్రమే ప్రత్యేకతగా నిలిచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని సరాసరి నెలకు 35 వేల క్యూబిక్ మీటర్లు వెలికి తీస్తున్నారు. ఏడాదికి 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాయి నాణ్యతను బట్టి క్యూబిక్ మీటర్ రాయి రూ 25 వేల నుంచి రూ 65 వేల వరకు ధర పలుకుతుంది. సరాసరిన క్యూబిక్ మీటర్ రాయి రూ 50 వేలు ఉంటుంది. 1983 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికితీశారు. దానిలో నికరంగా రాయల్టీ చెల్లించి ఎగుమతి చేసిన రాయి దాదాపు 35 లక్షల క్యూబిక్ మీటర్లుంది. దీని ద్వారా ఇప్పటి వరకు రూ 17,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక డంపింగ్‌ల మీద, దొడ్డిదారిన అధికారుల కళ్లుగప్పి, క్వారీల్లో వృథాగా మరో 15 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి పోయిందని స్థానికుల అంచనా. దీని ద్వారా మరో రూ 4 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం మీద ఇప్పటి వరకు వెలికితీసిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ విలువ రూ 20 వేల కోట్లపైనే ఉందని మైన్స్ అధికారుల రికార్డుల ద్వారా వెల్లడవుతోంది. దీని వలన ప్రభుత్వానికి 1983 నుంచి ఇప్పటి వరకు రూ 726.4 కోట్ల ఆదాయం వచ్చింది. రాయల్టీ చెల్లించకుండా అడ్డదారిలో రవాణా చేస్తున్న గ్రానైట్ వలన అపరాధ రుసుం ద్వారా మరో రూ 300 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. వెరసి మొత్తం మీద గడిచిన 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ తరలిపోగా, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరింది.
 మిగిలింది కాలుష్యమే...
 వేలాది కోట్ల విలువైన గ్రానైట్ సంపదను తీసుకెళ్లే గ్రానైట్ యజమానులు కనీసం స్థానికులకు కల్పించాల్సిన కనీస వసతులు మరిచారు. గ్రానైట్ పరిశ్రమల కారణంగా మండలంలోని సగానికిపైగా గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ఆయా గ్రామాల్లో ప్రజలంతా శ్వాసకోశ వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రానైట్ గుంతల్లో నిల్వ ఉండే నీటి వలన దోమలు, ఈగలు పెరిగి డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎక్కువయ్యాయి. మలేరియా వ్యాధి వ్యాప్తిలో జిల్లాలో చీమకుర్తిదే మొదటి స్థానం. ఇతర ప్రాంతాల నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగా వచ్చిన కార్మికుల వల్ల ఎయిడ్స్ వ్యాధి విస్తరణలో చీమకుర్తి జిల్లాలోనే మొదటి స్థానం ఆక్రమించింది. తాగునీటికి ఫ్లోరైడ్ నీరే దిక్కయింది.
 
 కావాల్సినవివీ...
 చీమకుర్తి మండలంలో నివసిస్తున్న 79 వేల మంది ప్రజలకు ఉపయోగపడేలా అన్ని వ్యాధులకు చికిత్స చేయగలిగే స్థాయిలో ఉండే ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉంది. 35 వేల మంది జనాభా ఉన్న చీమకుర్తి పట్టణానికి సురక్షితమైన నీరందించేందుకు కనీసం రెండు ఆర్‌ఓ ప్లాంట్లు నిర్మించాలి. గ్రామాల్లో వర్షం నీరు నిలబడకుండా ప్రవహించేందుకు సైడు కాల్వలు నిర్మించాలి. ఆడపిల్లలు ప్రత్యేకంగా చదువుకునేందుకు బాలికల హైస్కూలు, కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణం లేక వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలు వృథాగా పోతున్నాయి. క్రీడా ప్రాంగణంతో పాటు స్థానికులకు పార్కు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాలుష్యాన్ని నివారించేందుకు వీధుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా సాగించాలి. గ్రానైట్ మెటీరియల్ రవాణాతో ఛిద్రమైన రోడ్లను, కల్వర్టులను మరమ్మతులు చేయాలి. వేల కోట్ల విలువైన భూగర్భ సంపదను తరలించే ముందు స్థానికులకు కనీసం ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచనే ఎవరికీ రాకపోవడం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement