వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరాహార దీక్ష
చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
బుడమేరు గేట్లు ఎత్తారు.. కలెక్టరేట్ గేట్లు మూశారని విమర్శలు
దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ గురువారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టింది. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంవల్లే బుడమేరు వరదలో ప్రజలు నిండా మునిగారని, పెద్ద ఎత్తున నష్టపోయారని దీక్షలో పాల్గొన్న నేతలు తెలిపారు. బాధితుల్లో ఒక్కరికీ పూర్తి నష్ట పరిహారం అందలేదని, ఆదుకోవాలంటూ సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోవటంలేదని ధ్వజమెత్తారు. బుడమేరు గేట్లు ఎత్తిన ప్రభుత్వం, నష్టపరిహారం కోసం అర్జీలు తీసుకోకుండా కలెక్టరేట్ గేట్లు మూసేసిందని మండిపడ్డారు.
వరద సహాయక చర్యల పేరుతో అవినీతి బురద పారిందని దుయ్యబట్టారు. సాయం చేయాల్సింది పోయి, బాధితులపై లాఠిఛార్జి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బాధితుల్లో చివరి వ్యక్తికి కూడా పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు భరోసా ఇచ్చారు.
బాబు వల్లే బుడమేరుకు వరద
సీఎం చంద్రబాబు వల్లే బుడమేరు వరద విజయవాడను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. వరదతో నగరంలో 32 డివిజన్లలో 2.69 లక్షల కుటుంబాలు నీట మునిగాయన్నారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని అడుగుతుంటే అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ మీద పడి ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటం ప్రారంభించామని, ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది అని చెప్పారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టి 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని చెప్పారు. వరద బాధితుల కోసం చేసిన ఖర్చుపై తమ లెక్కలు ఇస్తామని, ప్రభుత్వం లెక్కలు ఇవ్వాలని, వాటిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.
సీఎం చంద్రబాబు ఇల్లు, అమరావతి మునిగిపోకుండా బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారని ఎమ్మెల్సీ రుహూల్లా చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రతి దేవస్థానం నుంచి ఆహారాన్ని తీసుకొచ్చారని, దానిని బాధితులకు అందించకుండా బయట పడేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేసే దుస్థితి నెలకొందన్నారు.
కంచికచర్లలో ముంపునకు గురైన ప్రాంతాల వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగలక్షి్మ, వైఎస్సార్‌సీపీ నాయకుడు పోతిన మహేష్, విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, పార్టీ నేత గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment