సాయం అందక.. నిస్సహాయంగా | Budameru Flood victims rushed to Vijayawada Collectorate | Sakshi
Sakshi News home page

సాయం అందక.. నిస్సహాయంగా

Published Tue, Oct 1 2024 5:39 AM | Last Updated on Tue, Oct 1 2024 5:39 AM

Budameru Flood victims rushed to Vijayawada Collectorate

విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తిన వరద బాధితులు

ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డున పడేసింది

జగన్‌ ప్రభుత్వమే ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన

తప్పుల తడకగా నష్టం అంచనా జాబితా

నెల రోజులైనా బాధితులకు అందని పరిహారం  

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) / విజయవాడ స్పోర్ట్స్‌: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగు­తున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ 
కలె­క్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసు­పత్రుల పాలవుతున్నాం. 

ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. 

కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 

పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.

చివరి రోజు కావడంతో..
బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్‌ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. 

ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.

జాబితాలో చిత్ర విచిత్రాలు..
‘‘ప్రియమైన పైడి సాయిదీపక్‌...! మీ బ్యాంకు ఖాతా ఆధార్‌ నంబరుతో లింక్‌ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్‌ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్‌ లింక్‌ అయ్యే అవకాశమే లేదు. 

నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్‌ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.

పొంతన లేని లెక్కలు..
ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.

జగన్‌ ప్రభుత్వమే ఉంటే..
కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. 

అదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.

అమ్మకు రిక్త హస్తం..
వాంబే కాలనీ హెచ్‌ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్‌లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. 
– కురిటి సుజాత, వాంబే కాలనీ

గతంలో ప్రతిదీ ఇంటి వద్దే..
జగన్‌ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. 
– పాముల పద్మ, వాంబే కాలనీ

ఇదిగో.. అదిగో అంటున్నారు
ప్రకాష్‌ నగర్‌లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్‌లో అర్జీ ఇద్దామని వచ్చా. 
– షేక్‌ ఫాతిమా, ప్రకాష్‌నగర్‌

ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..
కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. 
– ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులు

కాళ్లు అరిగేలా తిరిగా..
పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 
– వెంకాయమ్మ, పైపుల రోడ్డు


ఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్‌ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్‌ నెంబర్‌ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్‌ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement