ఆహారం, తిండి, తాగునీటి కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులు
ట్రాక్టర్, కారు ఏదొచ్చినా ఆహారం పొట్లాలు
ఇచ్చేందుకేననే ఆతృతతో వాటిచుట్టూ పరుగులు
జక్కంపూడి, ఆంధ్రప్రభ కాలనీల్లో దయనీయ పరిస్థితులు
ముంపు నుంచి కోలుకునే వరకు ప్రభుత్వమే ఆహారం అందించాలని వేడుకోలు
పటమట/చిట్టినగర్ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.
ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్ అధికారులు మైక్‌లో ప్రచారం చేయడంతో వాటర్ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.
జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు
ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి
ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు.
వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ కోల్పోయాం
ఇదేం వరదో. కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.
– వసంత, ఆంధ్రప్రభ కాలనీ
జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది
మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్ కార్డులు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.
– వెంకటదుర్గా సూర్యకుమారి,
ఆంధ్రప్రభ కాలనీ
అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి.
– లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment