ఆశలు ఆవిరి
⇒ కలవర పెడుతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు
⇒ కనిష్ట మట్టానికి చేరువలో నీటి నిల్వలు
⇒ తాగునీటి అవసరాలకే అధికారుల ప్రాధాన్యం
⇒ ఆరుతడి పంటలకూ సాగునీరు అనుమానమే
⇒ ఆందోళనలో ఆయకట్టుదారులు
నిజాసాంగర్: ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని జిల్లా కేంద్రంతో పాటు బోధన్ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
రబీ పంటకు నీళ్లులేనట్లే!
నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు వరకు 2.4 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. చివరి ఆయకట్టుకు చెరువులు, కుంటలతోపాటు బోరుబావులు ఆధారంగా ఉన్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంతంలోని లక్ష ఎకరాలకు ప్రధాన కాలువే జీవనాధారం. ఖరీఫ్‌లో వరుణుడు కరుణించకపోవడంతో అక్కడ ఉన్న సుమారు 15వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ప్రధాన కాలువను నమ్ముకుని బీర్కూర్, వర్ని, కోటగిరి, ఎడపల్లి, బోధన్ తదితర మండలాలలోని రైతులు సుమారు 80 వేల ఎకరాలలో వరి సాగు చేశారు.
వీటికి అధికారులు ప్రాజెక్టు నుంచి నాలుగు విడతలలో 4.1 టీఎంసీల నీటిని ప్రధాన కాలువ ద్వారా అందించారు. ఫలితంగా అక్కడ పంటలు సాగు చేసిన రైతులు గట్టెక్కారు. మొదటి ఆయకట్టు పరిధిలోని నిజాంసాగర్, సుల్తాన్‌నగర్, గున్కుల్, మహమ్మద్‌నగర్, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ, గాలిపూర్, ముగ్దుంపూర్, కొత్తాబాది, తిర్మాలాపూర్, తాడ్కోల్, బుడ్మి, బాన్సువాడ ప్రాంతాలలో వందల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఆయా ప్రాంతాల రైతులు రబీలో మొక్క జొన్న, జొన్న, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం సాగు నీరు అత్యవసరంగా మారింది. నీటి తడులు లేక పంటలు వాడిపోతుండటంతో రైతులు కలవరపడుతున్నారు.
తాగునీటికే ప్రాధాన్యం
నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకూ జలాలు అడుగంటుతున్నాయి. అవిరి రూపంతోపాటు వ్యవసాయ పంపుసెట్ల ఎత్తిపోతలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. రోజుకు 75 నుంచి వంద క్యూసెక్కుల మేర నీరు తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు, 17 .8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,381 అడుగులతో 1.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి కోసం ఉపయోగించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. రబీ సీజన్‌లో ప్రధాన కాలువకు ఎట్టిపరిస్థితులలోనూ నీటిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
బెల్లాల్, అలీసాగర్ నుంచి పట్టణాలకు తాగునీరు
జిల్లా కేంద్రంతోపాటు బోధన్ పట్టణ ప్రజలకు వేసవిలో తాగునీటి కొరత రాకుండా నీటి నిల్వలున్నాయి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్, బోధన్ మండలంలోని బెల్లాల్ చెరువులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి రోజుకు 1.25 ఎంసీఎఫ్‌టీల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. బెల్లాల్ చెరువు ద్వారా రోజు 1.5 ఎంసీఎఫ్‌టీల నీటిని బోధన్ పట్టణానికి తాగునీరందిస్తున్నారు.
అలీసాగర్, బెల్లాల్ చెరువులో నీటినిల్వలున్నందున మార్చి నెలాఖరు వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రధాన కాలువ మొద టి ఆయకట్టు కింద పంటలను సాగు చేసే రైతులకు ఇక బోరుబావులు, చెరువులు, కుంటలే శరణ్యంగా మారనున్నాయి.