ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశజనకంగా ఉంది.
నిజాంసాగర్ : ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశజనకంగా ఉంది. వానకాలం దాటిపోతున్నా వర్షాల జాడలేక ప్రాజెక్టులోకి చుక్కనీరు చేరలేదు. ప్రతిఏటా ఆగస్టు రెండోవారానికి కొత్తనీటితో కళకళలాడే ప్రాజెక్టు ఈసారి వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురవక పోవడంతో వరద రాలేదు.
ప్రాజెక్టును నమ్ముకొని ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారంది. చివరి ఆయకట్టు వరకు సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను పండిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల అంచనా. ప్రధాన కాలువపై ఆధారపడకుండా వ్యవసాయ బోరుబావులతో చాలామంది రైతులు వరి వేశారు. ప్రధాన కాలువను నమ్ముకుని పంటలు సాగు చేసే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పంట చేతికి వచ్చే దాకా నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు.
నేటి నుంచి ప్రధాన కాలువకు నీరు
జిల్లా ప్రజల గొంతు తడపడానికి సోమవారం నుంచి ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎత్తిపోతలతో పాటు అలీసాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి నీటివిడుదల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రసుత్తం ప్రాజెక్టులో 1392.20 అడుగులతో 5.090 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి జిల్లా ప్రజల దాహార్తి కోసం 0.2 టీఎంసీల నీటి విడుదల కోసం అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. బాన్సువాడ, బోధన్ , నిజామాబాద్‌ల కోసం ప్రధాన కాలువకు నీటిని అందించడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిపారుదలశాఖ అధికారుల సమీక్షలో సుముఖత తెలిపినట్లు తెలిసింది.