nijansagar
-
జలం జన‘సాగరం’
-
నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
10 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రాజెక్టులోకి 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిజాంసాగర్ : మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా 1.95 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తుగానే ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,400 అడుగుల(11 టీఎంసీలు) నీరుంది. ప్రమాదకరస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆనందంగా ఉంది.. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిందని, వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తిన సందర్భంగా మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీ వాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్‌లోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులోకి వరదనీరు ప్రమాదకర స్థాయిలో వస్తుండడంతో ముందుజాగ్రత్తగా దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. వర్షాకాలం ఇంకా పూర్తికాలేదని, మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగానే వస్తానని ముఖ్య మంత్రి చెప్పారన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సీఎం పర్యటన ఉంటుందన్నారు. -
వరుణుడిపైనే భారం
ఎండుతున్న పంటలు పెద్దశంకరంపేటలో కరువు ఛాయలు కనీస వర్షపాతం నమోదుకాని దుస్థితి చెరువులు, కుంటలు వెలవెల ఆందోళనలో రైతులు పెద్దశంకరంపేట:మండలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. వర్షాలు మొహం చాటేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతీ యేటా ఖరీఫ్ సీజన్లో చెరువులు, కుంటల కింద భారీగా వరిపంటను సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మక్కజొన్నను సాగు చేస్తారు. మండలంలో ఎక్కువగా వరి, మక్కజొన్న పంటలను మాత్రమే సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతులు బోరుబావులు, చెరువులు, కుంటలపై మాత్రమే ఆధారపడ్డారు. నాలుగైదు గ్రామాలు మాత్రమే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్‌ల ద్వారా తమ బోర్లతో పంటలను పండించుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో పంటలు బాగానే పండుతున్నా ఈ ఏడాది కరువు రక్కసి కాటేసే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే మండలంలో సగానికిపైగా పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. మూడు రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. కానీ మండలంలో ముసురుకే పరిమితమైంది. దాదాపు ఆగస్టు నెలలో ఒక్క భారీ వర్షం కూడా పడకపోవడంతో రైతుల్లో పంటల దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. ఎక్కడ చూసిన రైతులు ఆదే చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కనీస వర్ష పాతం కూడా నమోదు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తాపేట, రామోజిపల్లి, నారాయణపల్లి, వీరోజిపల్లి, మాడ్చెట్‌పల్లి, బద్దారం, మల్కాపూర్, ఉత్తులూర్, బూర్గుపల్లి, టెంకటి, బుజ్రాన్‌పల్లి, జంబికుంట, చీలాపల్లి తదితర గ్రామాల్లో వరిపంటతో పాటు మొక్కజొన్నను సాగు చేశారు. ఓ వైపు బోర్ల వద్ద పంటలను సాగు చేస్తున్నా చివరి వరకు దిగుబడి వస్తుందా రాదా ఆనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల మక్కజొన్న భారీగా ఎండిపోయింది. దీంతో పాటు బోర్ల వద్ద రైతులు నీరు సక్రమంగా రాకపోవడంతో కొన్ని మడులను వదిలేసి కొంత మేర మాత్రమే పంటలను దక్కించుకుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన రైతులకు పెట్టుబడులతో పాటు దిగుబడులు కూడా రాకపోవడంతో వారు అప్పులపాలయ్యే ప్రమాదం నెలకొంది. పేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు -
నిరాశాజనకంగా నిజాం‘సాగర్’
నిజాంసాగర్ : ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశజనకంగా ఉంది. వానకాలం దాటిపోతున్నా వర్షాల జాడలేక ప్రాజెక్టులోకి చుక్కనీరు చేరలేదు. ప్రతిఏటా ఆగస్టు రెండోవారానికి కొత్తనీటితో కళకళలాడే ప్రాజెక్టు ఈసారి వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురవక పోవడంతో వరద రాలేదు. ప్రాజెక్టును నమ్ముకొని ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారంది. చివరి ఆయకట్టు వరకు సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను పండిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల అంచనా. ప్రధాన కాలువపై ఆధారపడకుండా వ్యవసాయ బోరుబావులతో చాలామంది రైతులు వరి వేశారు. ప్రధాన కాలువను నమ్ముకుని పంటలు సాగు చేసే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పంట చేతికి వచ్చే దాకా నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. నేటి నుంచి ప్రధాన కాలువకు నీరు జిల్లా ప్రజల గొంతు తడపడానికి సోమవారం నుంచి ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎత్తిపోతలతో పాటు అలీసాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి నీటివిడుదల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ప్రాజెక్టులో 1392.20 అడుగులతో 5.090 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి జిల్లా ప్రజల దాహార్తి కోసం 0.2 టీఎంసీల నీటి విడుదల కోసం అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. బాన్సువాడ, బోధన్ , నిజామాబాద్‌ల కోసం ప్రధాన కాలువకు నీటిని అందించడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిపారుదలశాఖ అధికారుల సమీక్షలో సుముఖత తెలిపినట్లు తెలిసింది. -
పేరుకే ఆదర్శం
నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి. ఆదర్శానికి ఆరు వందలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది. ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు. -
ఆరు నెలల్లో పూర్తవ్వాలి ‘లెండి’
నిజాంసాగర్ : లెండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తెలిపారు. వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సాగునీటి ప్రాజెక్టుల పనులను కాంట్రాక్టర్లతో సకాలంలో పూర్తిచేయించాలని ఆదేశించారన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేల సమక్షంలో సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే ‘సాక్షి’తో వివరించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సీడీ-1, సీడీ-2 జీరో డిస్ట్రిబ్యూటరి నుంచి ప్రధాన కాలువ 7 ఏ డిస్ట్రిబ్యూటరి వరకు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించామన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానన్నారని పేర్కొన్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి కుడి, ఎడమ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు పునరుద్ధరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి 15 రోజుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాలని సూచించామన్నారు. పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనుల కోసం 15 రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు మిగులు జలాలకు దిగువ భాగాన బ్యారేజ్ నిర్మించాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఏదుల్కావ్ చెరువులోకి నీటిని నింపి, వజ్రఖండి చెరువు వరకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బిజ్జల్ వాడి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారని వివరించారు. సమావేశంలో పిట్లం జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. -
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాజెక్టులకు మహర్దశ
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాం నవాబు కాలంలో నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే మరమ్మతులకు నోచుకోవడం లేదని నిజాంపరిపాలనా చీఫ్ ఇంజినీర్ నవాబ్‌అలీ నవాజ్‌జంగ్ బహదూర్ మనుమళ్లు నవాబ్మీర్ అక్బర్అలీ, నవాబ్మీర్ హైమద్‌అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారు గురవారం నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు, గోల్‌బంగ్లా, రెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్రానైట్‌రాళ్లు, డంగు సున్నంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఇప్పటికీ పటిష్టంగా ఉందన్నారు. ప్రాజెక్టు కట్టకు అక్కడక్కడ పగుళ్లు వచ్చినా ప్రస్తుత పాలకులు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు మహర్దశ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు దిగువన నిర్మించిన స్విమ్మింగ్‌ఫూల్‌లో నీటి సౌకర్యం లేక మూతపడటం బాధాకరంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు స్విమ్మింగ్‌పూల్, సమ్మర్‌బాగ్ మరమ్మతులు తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతాయన్నారు. ని జాంకాలంలో నిర్మించిన ప్రాజెక్టులు, అప్పటి ఇంజనీర్ల మేథోమధనం చిరకాలం గుర్తుంటుందని అన్నారు. ప్రాజెక్టును సందర్శించిన చీఫ్ ఇంజినీర్ మనుమళ్లకు స్థానిక నీటిపారుదల శాఖ అధికారులు కట్టడాలను చూపించి ప్రాజెక్టు సామర్థ్యం వివరాలను తెలియజేశారు. వారి వెంట స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఆయకట్టుకు ‘సాగర్’ నీటి విడుదల
నిజాంసాగర్, న్యూస్‌లైన్ :ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. పదిహేను రోజల పాటు ప్రధాన కాలువ ద్వారా రెండు టీఎంసీల నీటిని పంటలకు అందించనున్నట్లు జిల్లా నీటిపారుదలశాఖ ఈఈ సత్యశీలారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన కాలువకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధాన కాలువ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ 50 వరకు లక్షా 37 వేల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం సాగునీరు అత్యవసరం కావడంతో నీరందిస్తున్నామన్నారు. మొదటి డిస్ట్రిబ్యూటరీ నుంచి 50వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగ వుతున్న పంటల కోసం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్ర స్తుతం ప్రధాన కాలువకు 12వందల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆయకట్టు అవసరాలకు డిమాండ్ మేర నీటిని విడుదలను పెంచుతామన్నారు. ఆయకట్టు కింద 80 శాతం వరి, 10 శాతం చెరుకు, 10 శాతం ఆరుతడి పంటలను సాగు చేస్తున్నట్లు వివరించారు. నిజాంసాగర్ మండలంలో ప్రధాన కాలువ కింద నాలుగు వేల ఎకరాలు, బాన్సువాడలో 10,500 ఎకరాల్లో, బీర్కూర్‌లో 6,500 ఎకరాల్లో, కోటగిరి 28 వేల ఎకరాాల్లో, వర్ని 16,500 ఎకరాల్లో, బోధన్ 11 వేల ఎకరాల్లో, ఎడపల్లిలో 9,500 ఎకరాల్లో, రెంజల్11 వేల ఎకరాల్లో, నవీపేట మండలంలో 14 వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తు న్నారని ఆయన వివరించారు. జలవిద్యుదుత్పత్తి ప్రారంభం... నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తుండటంతో హెడ్‌స్లూయిస్ వద్ద జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. విద్యుదుత్పత్తి కేంద్రంలోని రెండో టర్బయిన్ద్వారా 1.86 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో ఏడీ శ్రీకాంత్ తెలిపారు.