నిజాంసాగర్ : లెండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తెలిపారు. వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సాగునీటి ప్రాజెక్టుల పనులను కాంట్రాక్టర్లతో సకాలంలో పూర్తిచేయించాలని ఆదేశించారన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేల సమక్షంలో సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే ‘సాక్షి’తో వివరించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సీడీ-1, సీడీ-2 జీరో డిస్ట్రిబ్యూటరి నుంచి ప్రధాన కాలువ 7 ఏ డిస్ట్రిబ్యూటరి వరకు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించామన్నారు.
మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానన్నారని పేర్కొన్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి కుడి, ఎడమ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు పునరుద్ధరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి 15 రోజుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాలని సూచించామన్నారు. పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనుల కోసం 15 రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు.
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు మిగులు జలాలకు దిగువ భాగాన బ్యారేజ్ నిర్మించాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఏదుల్‌కావ్ చెరువులోకి నీటిని నింపి, వజ్రఖండి చెరువు వరకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బిజ్జల్ వాడి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారని వివరించారు. సమావేశంలో పిట్లం జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారని తెలిపారు.
ఆరు నెలల్లో పూర్తవ్వాలి ‘లెండి’
Published Mon, Aug 4 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Advertisement