చిన్నబోయిన మోకుకు వెన్నుదన్నుగా నిలిచిన సాక్షి
- ఈతవనాల పెంపకానికి భారీగా తరలివచ్చిన గౌడన్నలు
- గౌడ సమస్యలకు వేదికైన చిట్టాపూర్
- సాక్షి చొరవను అభినందించిన మంత్రి హరీష్‌రావు
- గీతవృత్తిపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని హామీ
- ఆనందం వ్యక్తంచేసిన కల్లుగీతాకార్మికులు
మెదక్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గీతా వృత్తికి సాక్షి దినపత్రిక వెన్నుదన్నుగా నిలిచింది. ఈతవనాల పెంపకానికి పిలుపునివ్వడంతో జిల్లా నలుమూలల నుండి గౌడజనులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. నిర్వీర్యమవుతున్న గీతా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సాక్షి చేసిన చిన్న ప్రయత్నానికి ప్రశంసల వెల్లువ లభించింది. కనుమరుగ వుతున్న గీత వృత్తిని బతికించేందుకు సాక్షి ఆధ్వర్యంలో ఈత వనాల పెంపుకోసం మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి 10వేల చిలుకు గౌడజనులు వాహనాల్లో తరలివచ్చి వేలాది ఈతమొక్కలు నాటారు. జనంతో చిట్టాపూర్ గ్రామం కిక్కిరిసింది. రాజుల కాలం నుండి సురాపానకానికి(కల్లు)కు ఎంతో ప్రత్యేకత ఉండేది. కాగా కల్తీకల్లు విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఎంతో మంది గౌడన్నలను జైళ్లోపెట్టారు. వారిదాడులను భరించలేని ఎంతోమంది గీతాకార్మికులు కల్లు విక్రయించడం తమతోకాదంటూ దుకాణాలను లీజుకివ్వడం మొదలు పెట్టి వృత్తికి దూరమయ్యారు.
మరికొందరు గత్యంతరంలేక వారి వద్దనే జీతం ఉంటూ దుర్బర జీవితాలు గడుపుతున్నారు. దీనికంతటికి ఒకే కారణం ఈత వనాలు లేకపోవడమేనన్న విషయాన్ని క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాక్షి దినపత్రిక ప్రతి గ్రామంలో విరివిగా ఈతవనాలు ఉంటే కల్తీకల్లును ఎందుకు తయారుచేస్తారు. అనే ఆలోచనతో మెదక్ జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఈతవనాల పెంపునకు శ్రీకారం చుట్టి అక్కడే బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి పదివేలకుపైగా గౌడ జనులు తరలివచ్చి తమ సమస్యలను రాష్ట్రమంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్‌రావు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గౌడజనుల సమస్యలను పరిష్కరిస్తామని హామినిచ్చారు. దీంతో గౌడకులస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈసమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌లతోపాటు అనేకమంది ప్రముఖులు తరలివచ్చి సాక్షిని అభినందించారు.