వరుణుడిపైనే భారం
- ఎండుతున్న పంటలు
- పెద్దశంకరంపేటలో కరువు ఛాయలు
- కనీస వర్షపాతం నమోదుకాని దుస్థితి
- చెరువులు, కుంటలు వెలవెల
- ఆందోళనలో రైతులు
పెద్దశంకరంపేట:మండలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. వర్షాలు మొహం చాటేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతీ యేటా ఖరీఫ్ సీజన్‌లో చెరువులు, కుంటల కింద భారీగా వరిపంటను సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మక్కజొన్నను సాగు చేస్తారు. మండలంలో ఎక్కువగా వరి, మక్కజొన్న పంటలను మాత్రమే సాగు చేస్తుంటారు.
ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతులు బోరుబావులు, చెరువులు, కుంటలపై మాత్రమే ఆధారపడ్డారు. నాలుగైదు గ్రామాలు మాత్రమే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్‌ల ద్వారా తమ బోర్లతో పంటలను పండించుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో పంటలు బాగానే పండుతున్నా ఈ ఏడాది కరువు రక్కసి కాటేసే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే మండలంలో సగానికిపైగా పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. మూడు రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి.
కానీ మండలంలో ముసురుకే పరిమితమైంది. దాదాపు ఆగస్టు నెలలో ఒక్క భారీ వర్షం కూడా పడకపోవడంతో రైతుల్లో పంటల దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. ఎక్కడ చూసిన రైతులు ఆదే చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కనీస వర్ష పాతం కూడా నమోదు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తాపేట, రామోజిపల్లి, నారాయణపల్లి, వీరోజిపల్లి, మాడ్చెట్‌పల్లి, బద్దారం, మల్కాపూర్, ఉత్తులూర్, బూర్గుపల్లి, టెంకటి, బుజ్రాన్‌పల్లి, జంబికుంట, చీలాపల్లి తదితర గ్రామాల్లో వరిపంటతో పాటు మొక్కజొన్నను సాగు చేశారు.
ఓ వైపు బోర్ల వద్ద పంటలను సాగు చేస్తున్నా చివరి వరకు దిగుబడి వస్తుందా రాదా ఆనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల మక్కజొన్న భారీగా ఎండిపోయింది. దీంతో పాటు బోర్ల వద్ద రైతులు నీరు సక్రమంగా రాకపోవడంతో కొన్ని మడులను వదిలేసి కొంత మేర మాత్రమే పంటలను దక్కించుకుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించిన రైతులకు పెట్టుబడులతో పాటు దిగుబడులు కూడా రాకపోవడంతో వారు అప్పులపాలయ్యే ప్రమాదం నెలకొంది. పేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు