నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
-
10 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల
-
ప్రాజెక్టులోకి 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ :
మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా 1.95 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తుగానే ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,400 అడుగుల(11 టీఎంసీలు) నీరుంది. ప్రమాదకరస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆనందంగా ఉంది..
చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిందని, వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వరదగేట్లను ఎత్తిన సందర్భంగా మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీ వాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్‌లోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులోకి వరదనీరు ప్రమాదకర స్థాయిలో వస్తుండడంతో ముందుజాగ్రత్తగా దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. వర్షాకాలం ఇంకా పూర్తికాలేదని, మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగానే వస్తానని ముఖ్య మంత్రి చెప్పారన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సీఎం పర్యటన ఉంటుందన్నారు.