ఎరువుల దుకాణంలోని ఎరువుల బస్తాలు
యల్లనూరు: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా అన్నదాతల ఆర్థిక ప్రగతిలో మార్పు రావటం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదని నిరంతరం ఉపన్యాసాలు చెప్పి పాలిస్తున్న ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి మరచి రైతుపై మరో అదనపు భారం మోపుతున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభానికి ముందే ప్రభుత్వం మరోసారి ఎరువుల ధరలు పెంచటంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కో ఎరువు బస్తాపై రూ.100 నుంచి రూ.120 వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయం భారంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తోడు ఎరువుల ధరలకు రెక్కలు రావటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధరలేవీ?
రైతులు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఉత్సాహం చూపని ప్రభుత్వాలు ఎరువుల ధరల పెరుగుదలకు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడుతున్నారు. మూడేళ్లుగా వ్యవసాయానికి సాగునీరు, వర్షాలు లేకపోవడంతో కరువు కాటకాలతో అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం ధరలు పెంచటం సరికాదంటున్నారు. రైతులకు నిరంతరం అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడతామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతన్నలను నిండాముంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీలు తదితర ఖర్చులకు తోడు ప్రకృతి కరుణించకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు నియంత్రించాలి
ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడం చాలా దారుణం. రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంతో విఫలమైన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం సరికాదు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – రామచంద్రారెడ్డి, సీపీఐ నాయకుడు, యల్లనూరు
Comments
Please login to add a commentAdd a comment