ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు | telugu states farmers problems with loans and drought | Sakshi
Sakshi News home page

ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు

Published Wed, Jun 22 2016 12:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు - Sakshi

ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు

రెండేళ్ల వరస కరువు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశలు రేకెత్తిస్తూ తొలకరి పలకరించింది. సంప్రదాయానుసారం మృగశిర కార్తె పున్నమి రోజైన సోమవారం ఇష్ట దైవాలకు పూజలు చేసి అన్నదాతలు చేలో సాలు పట్టారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉండబోతున్నదన్న వార్తలు వారిలో ఉత్సాహాన్ని పెంచాయి. గత కొన్నేళ్లుగా రైతులపై ప్రకృతి పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. 2013లో ఏదో మేరకు వర్షాలు కురవడం తప్ప అంతకు ముందు మూడేళ్లూ...ఆ తర్వాత రెండేళ్లూ అదునుకు వాన జాడ లేదు. నీటి సదుపాయం ఉన్న పరిమిత ప్రాంతాల్లో పంటల పరిస్థితి కొద్దో గొప్పో బాగున్నదనుకుంటే అకాల వర్షాలు, వడగండ్లు దెబ్బతీశాయి. నిరుడు ఖరీఫ్‌కు ఏపీ, తెలంగాణల్లో నిర్దేశించిన లక్ష్యాలతో పోలిస్తే వాస్తవంగా సాగు జరిగిన విస్తీర్ణం తక్కువ. పర్యవసానంగా పంటల దిగుబడి కూడా అంతంత మాత్రమే.

ఇలా ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉన్న రైతన్నలు ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. తమకు ఈసారి అంతా మంచే జరుగుతుందన్న భావనతో ఉన్నారు. ప్రకృతి సృష్టిస్తున్న అవరోధాలెన్నిటినో అనునిత్యం ఎదుర్కొంటున్నా నిబ్బరంగా అడుగులేస్తున్న అన్నదాతలను ప్రభుత్వాల నిర్లక్ష్యం, వాటి అపసవ్య విధానాలు ఎంతో కుంగదీస్తున్నాయి.  తొలకరి ముంగిట్లోకొచ్చిన ఈ దశలో కూడా ఇరు రాష్ట్రాల్లోనూ రైతులకు రుణలభ్యత అంతంతమాత్రంగానే ఉందని వార్తలొ స్తున్నాయి. ఈ ఏడాది రైతులకు రూ. 29,101 కోట్ల పంట రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఖరీఫ్ వాటా రూ. 17,640 కోట్లు. కానీ ఇప్పటివరకూ బ్యాంకులిచ్చిన రుణాలు రూ. 1,000 కోట్లకు మించి లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకపోవడం వల్ల పంట రుణాలివ్వడానికి బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి.

ఏపీలో పరిస్థితి ఇంతకన్నా అధ్వాన్నంగా ఉంది. పాత బకాయిలు చెల్లించలేదంటూ కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈసారి వర్షాలు బాగా ఉంటాయని మన వాతావరణ విభాగం అంచనాలిచ్చి రెండు నెలలవుతున్నా తన వంతుగా చేయాల్సిందేమిటోనన్న స్పృహ బాబు సర్కారుకు లేకపోయింది. రెండేళ్ల వరస కరువుతో రైతులు దిక్కుతోచక విలవిల్లాడుతున్నారని తెలిసినా పాత రుణాలపై వడ్డీ మాఫీ, వాటి రీషెడ్యూల్, కొత్త రుణాల మంజూరు వగైరా అంశాలపై బ్యాంకులతో మాట్లాడి ఒప్పించడంలాంటివేవీ చేయలేక పోయింది. వీటి సంగతలా ఉంచి రెండు రాష్ట్రాలకూ కేంద్రం నుంచి రెండు నెలల క్రితమే విపత్తు సాయం అందినా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇంతవరకూ చేరలేదు.

ఈసారి ఖరీఫ్‌కు కేంద్రం దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల టన్నుల దిగుబడిని లక్ష్యంగా నిర్దేశించింది. అందులో రెండు రాష్ట్రాల వాటాలూ గణనీయంగానే ఉన్నాయి. అందుకనుగుణంగా ఏపీలో కోటికిపైగా ఎకరాల్లోనూ...తెలంగాణలో 1.12కోట్ల ఎకరాల్లోనూ సాగు చేయాలని ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించు కున్నాయి. అయితే దానికి కొనసాగింపుగా తమ వైపుగా చేయాల్సినవి చాలా ఉన్నాయని ప్రభుత్వాలు గుర్తించాలి. వెనువెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయడం, బ్యాంకులనుంచి రుణాలిప్పించడం, రుణ మంజూరులో సమస్యలు ఎదురైతే అధికారులు జోక్యం చేసుకుని పరిష్కరించేలా చూడటం అవసరం. ఇప్పటికే అనేకమంది రైతులకు బ్యాంకుల మొండిచేయి చూపడంతో ఎప్పటిలా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వైపు వెళ్తున్నారు. ఇన్నాళ్ల కరువుతో అన్నివిధాలా నష్టపోయి ఉన్న రైతును ఇది మరింత కుంగదీస్తుంది.

రుణాల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద వర్తమానం మన కళ్లముందు ఉంది. ఇది పునరావృత్తం కానీయరాదనుకుంటే రైతులందరికీ బ్యాంకులు రుణాలిచ్చేవిధంగా చూడాలి. విత్తనాల సమస్య కూడా రైతులను కుంగదీస్తున్నదే. మేలు రకం విత్తనాలు రైతులకు చేరేలా చర్య తీసుకోవడం ముఖ్యం. వాటి ధరలు అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. విత్తనాలకు కొరతేమీ లేదని, ఎలాంటి హడావుడీ పడొద్దని ప్రభుత్వాలు చెప్పడం... తీరా వాటి లభ్యత, నాణ్యత అంతంతమాత్రంగా ఉండటం...ధర ఆకాశాన్నంటడం గత అనుభవం. ఈ విషయంలో అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధరల్ని పెంచేస్తున్నాయి. ఆఖరికి భూసారం పెంచడానికి వినియోగించే పచ్చిరొట్ట పైర్ల విత్తనాల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. నాసిరకం ఎరువులపైనా కన్నేయవలసి ఉంది.

అవసరమైన భూసార పరీక్షలు జరిపించి ఎరువుల వినియో గానికి సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందించాలి. అనవసరంగా లేదా మోతాదుకు మించి ఎరువుల వాడకంవల్ల అనర్ధాలొస్తున్నాయని గుర్తించి... సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం పరంపరాగత్ కృషి వికాస్ యోజన కార్యక్రమం పేరిట నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దీన్ని వినియోగించుకోవాలి. సాగుబడి సమయంలో రైతులను ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు మొదలుకొని విత్తన వ్యాపారులు, ఎరువుల వ్యాపారుల వరకూ అందరి దయాదాక్షిణ్యాలకూ ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. తీరా దిగుబడి చేతికందే సమయంలో సరైన గిట్టుబాటు ధరలు ప్రకటించక... కనీసం ఆ ధరలైనా వారికి దక్కేలా చూడక దెబ్బతీస్తున్నాయి. రైతుల్ని మార్కెట్‌లో వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నా చోద్యం చూస్తున్నాయి. ఈ స్థితి మారాలి.

చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఈ అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోగలిగితే మంచి దిగుబడి సాధ్యం కావడంతోపాటు రైతుల ఆర్ధిక పరిస్థితి ఎంతోకొంత మెరుగవుతుంది. వరస నష్టాలను చవిచూస్తున్న రైతన్నకు కాస్తంత ఓదార్పు లభిస్తుంది. ఏపీలోని కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే కొన్నిచోట్ల రైతులు మళ్లీ సాగు సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 15వ తేదీకల్లా కాల్వల ఆధునికీకరణ పూర్తిచేసి సాగునీరు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోవడం రైతుల ఆగ్రహానికి కారణం. ఇప్పటికైనా పాలకులు చురుగ్గా వ్యవహరించి తమ లోపాల్ని సరిచేసుకోవాలి. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండటం తమ కనీస ధర్మమని గుర్తించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement