జాడలేని పరిహారం | Farmers waiting for the investment subsidy | Sakshi
Sakshi News home page

జాడలేని పరిహారం

Published Sun, May 20 2018 4:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Farmers waiting for the investment subsidy - Sakshi

సాక్షి, అమరావతి: కరువు, అకాల వర్షాలు, పెనుగాలులు లాంటి విపత్తులతో పంటలు కోల్పోయి అప్పుల పాలైన రైతులు పెట్టుబడి రాయితీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జూన్‌ 1వతేదీ నుంచి ఖరీఫ్‌ ప్రారంభం కానున్న తరుణంలో కనీసం పెట్టుబడి రాయితీ అయినా విడుదల ఇస్తే దుక్కులు, విత్తనాలకు పనికొస్తుందని ఎంతో ఆశతో  నిరీక్షిస్తున్నారు. 

రాయితీని ఎగ్గొట్టేందుకు...
గత ఖరీఫ్‌లో 500కిపైగా మండలాల్లో  వర్షాభావం నెలకొన్నా పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కరువు లేదని ప్రకటించింది. పంటలు ఎండిపోయినా రైతులకు పైసా పరిహారం రాలేదు. ఇక గత రబీలో చినుకు జాడ లేక మూడొంతుల మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. పరిస్థితి తీవ్రతను పట్టించుకోకుండా ప్రభుత్వం కేవలం 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి అన్నదాతలకు అన్యాయం చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన, పెనుగాలులకు పలుచోట్ల ధాన్యం మట్టి పాలైంది. మామిడి కాయలు రాలిపోయాయి. అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు దారుణంగా నష్టపోయారు. 

ప్రభుత్వ గణాంకాలే రుజువు
గత రబీలో 475 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 239 మండలాల్లో 20 నుంచి 60 శాతం తక్కువ వర్షం కురిసింది. 236 మండలాల్లో కురవాల్సిన వర్షం కంటే 60 శాతానికి పైగా తక్కువ వాన కురిసింది. 60 శాతం వర్షపాత లోటు ఉన్న మండలాలను వాతావరణశాఖ పెను దుర్బిక్ష ప్రాంతాలుగా పరిగణిస్తుంది. ఈ రబీలో ఇలాంటి మండలాలు 236 ఉండగా కనీసం వీటిని కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదు. 

రాష్ట్రానికి తీవ్ర నష్టం
ప్రభుత్వం కరువును కుదించడం వల్ల రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది. 121 మండలాల్లో కరువు ఉపశమన చర్యల కోసం రూ.680 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. రైతులకు రూ.166.7 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాల్సి ఉందని పేర్కొంది. వర్షపాత గణాంకాల ప్రకారం 475 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి ఉంటే ఇదే ప్రాతిపదికన కేంద్రం నుంచి అధిక మొత్తంలో సాయం పొందే అవకాశం ఉండేది. కరువును కుదించడంవల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గి రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో రైతులకైనా రూ.166.7 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేయలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement