సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల
వ్యవసాయశాఖ మంత్రి పోచారం
► గ్రామాల్లో రైతు సమావేశ మందిరాలు
► ఒక్కో భవన నిర్మాణానికి రూ.15 లక్షలు
► తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
► మే 15వ తేదీలోగా పెట్టుబడి రాయితీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా సర్ధాపూర్‌లో రూ.9.60 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రైతు సమావేశ మందిరాలు నిర్మిస్తామన్నారు.
ఏఈవోలు ఉండే గ్రామాల్లో ఒక్క భవన నిర్మాణానికి రూ.15 లక్షలు వెచ్చిస్తామని తెలిపారు. ఒకేపంట వేసి రైతులు నష్టపోకుండా క్రాప్‌కాలనీను ఏర్పాటు చేస్తామన్నారు. దిగుబడులు పెరగాలని, రైతుల అప్పులు తీరి, బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని వివరించారు.
వచ్చేఏడాది మే 15వ తేదీలోగా రైతులకు పెట్టుబడి రాయి తీని విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించి అమ్ముకునే స్థితికి చేరాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని పోచారం తెలిపారు. గ్రామాల్లో రైతులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధం కూరగాయలు, పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆత్మహత్యలులేని తెలంగాణను నిర్మిస్తామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఇదంతా అభూతకల్పన అన్నారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడి రాయితీ దేశానికే ఆదర్శం: కేటీఆర్
రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం దేశానికే ఆదర్శమని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సర్ధాపూర్ సభలో కేటీఆర్‌మాట్లాడుతూ, గిరకతాళ్ల పెంపకం కోసం ప్రతీ గ్రామంలో గీత కార్మికులకు ఐదెకరాలు కేటాయిస్తామనిప్రభుత్వ పనితీరుపై ఏం మాట్లాడలేక అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఏడాదిలో రూ.225 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చి, రూ.15 వేలకు మించి నెల వేతనం వచ్చేలా చేశామని మంత్రి వివరించారు.