సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోవల్ ఓరం పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం మారియట్ హోటల్‌లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్‌క్లేవ్–2018ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, కేంద్ర మంత్రి హోదాలోనూ వివక్షకు గురైన తీరును సభకు వివరించారు. ‘1999లో ఎంపీగా ఎన్నికై వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చాంబర్‌లోకి వెళ్దామని బయల్దేరా. కానీ నాకు ప్రత్యేక చాంబర్ లేదు. దాంతో అందుకోసం పోరాడి సాధించా’అని వివరించారు. గిరిజనులు రిజర్వేషన్లతో లాభపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, దీంతో వారి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అదేక్రమంలో గిరిజనులు తమ పేర్లను వారి సంప్రదాయాల ప్రకారం పెట్టుకోవడంతో సమాజంలో కొంత చిన్నచూపునకు గురవుతున్నారన్నారు. గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ప్రత్యేక రాయితీలిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
నైపుణ్యమున్న గిరిజనులకు పెట్టుబడి రాయితీ: ఈటల
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. మహిళలకు 45%, పురుషులకు 35% పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లోనూ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఓన్ యువర్ కార్ పథకం కింద ఒక్క వాహనంపై రూ.5 లక్షలు రాయితీ ఇచ్చామని, గిరిజన రైతులకు 95% రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ పనిముట్లన్నీ 95% రాయి తీతో అందిస్తున్నామని చెప్పారు.
కార్పొరేట్ల దగ్గర ప్రాజెక్టు రిపోర్టు ఉందని, కానీ గిరిజనుల దగ్గర కమిట్మెంట్ ఉందని అన్నారు. 45 మంది కార్పొరేట్లకు రూ.7.3 లక్షల కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకులు నైపుణ్యం ఉన్నవారికి మాత్రం రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని నూరుశాతం అమలు చేయాలంటే అధికారుల చిత్తశుద్ధి తోడవ్వాలన్నారు. ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల రాయితీ
Published Sat, Jul 14 2018 1:57 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment