⇒పంటల బీమాతో పెట్టుబడి రాయితీ ముడి
⇒రూ.500 కోట్లు నష్టపోనున్న అన్నదాతలు
⇒అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.370 కోట్లు నష్టం
అమరావతి: రాష్ట్రంలో కరువుబారిన పడి అల్లాడుతున్న రైతుల నెత్తిన మరోమారు శఠగోపం పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి అన్నదాతలకు రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా మొండిచేయి చూపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి ఇచ్చేందుకు అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల కరువుకు మారుపేరైన రాయలసీమ రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది.ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లకుపైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా.
హక్కులను హరించడమే
పంటల బీమా, పెట్టుబడి రాయితీని ముడిపెట్టడ మంటే రైతుల హక్కులను హరించడమే. రైతులు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేసుకుంటే వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంట దెబ్బతింటే మళ్లీ సాగు చేసుకోవడానికి చట్టబద్ధంగా ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రెండింటినీ పొందే హక్కు రైతులకు ఉంది. అయితే, పంట కోల్పోయిన రైతులకు ఏదైనా ఒకదాని కిందే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోకపోతే ఈ ఏడాది రైతులకు జరిగే నష్టం రూ.500 కోట్లు. ఇది ఈ ఏడాదికే పరిమితం కాదు. ఏటా రైతులు ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని పేర్కొంటున్నారు.
హెక్టార్‌కు గరిష్టంగా రూ.15,000
ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టార్‌కు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో రాయలసీమలో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎండిపోయింది. బీమా కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టార్‌కు గరిష్టంగా రూ.16,000 చెల్లించాలని లెక్కగట్టారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టార్‌కు రూ.15,000 చొప్పున చెల్లించాలని నివేదికలు రూపొందించింది.
ఒక రైతుకు పంటల బీమా హెక్టార్‌కు రూ.11,000 వచ్చిందనుకుంటే దానికి రూ.4,000 పెట్టుబడి రాయితీ కలిపి రూ.15,000 చెల్లిస్తారు. బీమానే రూ.15,000 వస్తే పెట్టుబడి రాయితీ అస్సలు ఇవ్వరు. పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతుందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు. రూ.576 కోట్ల పంటల బీమా మంజూరైనప్పటికీ ఇంకా రైతులకు చెల్లించకపోవడానికి కారణం పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టాలని నిర్ణయించడమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
మాట మార్చిన చంద్రబాబు నాయుడు
హరియాణా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని ముఖ్యమంత్రుల సాధికార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీతో సంబంధం లేకుండా హెక్టార్‌కు రూ.15,000 నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు 2010లో హైదరాబాద్‌లో దీక్ష చేశారు. దీనికి జాతీయ స్థాయి నేతలను సైతం ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అంశాన్ని మర్చిపోయారు. పైపెచ్చు పంటల బీమా, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టారు. రెతన్నలకు అన్యాయం చేస్తున్నారు.
వేర్వేరుగానే ఇవ్వాలి..
‘‘ప్రస్తుత విధానం ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీ, పంటల బీమాను వేర్వేరుగానే ఇవ్వాలి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పెట్టుబడి రాయితీని పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న పెట్టుబడి రాయితీ సాగు ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఖర్చులకు సమానంగా పెట్టుబడి రాయితీని నిర్ధారించాలి. పెట్టుబడి రాయితీ, పంటల బీమాను కలిపేయొద్దు’’
– రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు
‘‘పంట నష్టపోగానే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రైతులు ప్రీమియం చెల్లించినందుకు వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నందుకు ఇవ్వాల్సింది నష్ట పరిహారం. నష్ట పరిహారం ఎటూ ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచో వేర్వేరుగా ఇస్తున్న పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలిపేసి, రైతులకు ఒక్కటే ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. పెట్టుబడి రాయితీ గురించి అడిగితే వారంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు’’
– నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు
రైతులకు శఠగోపం!
Published Thu, Mar 30 2017 4:38 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
Advertisement
Advertisement