Department of Disaster Management
-
అదిగో.. పిడుగు!
సాక్షి, అమరావతి: నడి వేసవిలో పిడుగులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడగా మంగళవారం ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు పది మంది పిడుగుపాటుతో మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ నిర్థారించింది. అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ మూడు నెలల్లోనే.. ఏప్రిల్, మే, జూన్ నెలలు పిడుగుల సీజన్. సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 15 లక్షల పిడుగులు పడితే ఈ మూడు నెలల్లోనే 5 నుంచి 7 లక్షల పిడుగులు పడతాయి. శాటిలైట్ సమాచారం, ఇతర మార్గాల ద్వారా క్యుములోనింబస్ మేఘాలను బట్టి పిడుగుల సంఖ్యను లెక్కిస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018లో అత్యధికంగా 137 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎలా ఏర్పడతాయి? ఉత్తర భారత దేశం నుంచి వీచే పొడి గాలులు, సముద్రం నుంచి వచ్చే తడి గాలులు కలసి మేఘాలుగా ఏర్పడతాయి. నిటారుగా ఉండే వీటిని క్యుములోనింబస్ మేఘాలుగా పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడు కచ్చితంగా పిడుగులు పడతాయి. ఈ మేఘాల కిందభాగంలో తడి, పైభాగంలో పొడి గాలులు ఉంటాయి. ఒక మేఘంపైన మరో మేఘం ఆవరించి ఢీ కొన్నప్పుడు తడి, పొడి గాలుల ప్రతిస్పందనకు పిడుగులు పడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలి. రేకు, లోహంతో చేసిన నిర్మాణాల వద్ద ఉండకూడదు. ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. కారు, బస్సులో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు మెడ వెనుక జుత్తు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే పిడుగుపాటుకు సంకేతంగా భావించి అప్రమత్తం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. స్నానం, చేతులు కడగడం, నీటిలో గడపడం చేయకూడదు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు భాగాలను తాకరాదు. పిడుగును గుర్తించే సెన్సార్లు ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో హెచ్చరిస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను ముందే అప్రమత్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 11 సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
సాక్షి, విశాఖపట్నం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. ఫైర్ బృందాలను విపత్తులశాఖ కమిషనర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, నది పరీవాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నది దాటి వెళ్లడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం లాంటివి చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించికున్నాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద విపత్తుల నిర్వహణశాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 1,87,077 అవుట్ ఫ్లో 1,86,973 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 6,61,157 అవుట్ ఫ్లో 6,13,089 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,06,470 క్యూసెక్కులు ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 4,88,987, అవుట్ ఫ్లో 4,95,054 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 4,60,000, అవుట్ ఫ్లో 4,17,000 క్యూసెక్కలు ఉంది. -
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ
బోటు ప్రమాద స్థలి నుంచి సాక్షి బృందం: గోదావరిలో ప్రైవేట్ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. వెళ్లొస్తానని.. ఇలా వెళ్లావా తల్లీ.. ‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రమాద స్థలానికి వచ్చిన ఆ తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. చివరకు బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (24) బోటు ప్రమాదంలో గల్లంతయింది. తండ్రి సుదర్శన్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ కావడంతో ఆదే శాఖలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంది. కష్టపడి చదివి ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే కనపడకుండా పోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రమ్య ఆచూకీ కోసం వచ్చిన ఆమె మామయ్య రామచంద్రయ్య ఈ విషయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేనొక్కడినే బయటపడ్డా.. తాలిబ్ పటేల్, సాయికుమార్, నేను స్నేహితులం. పాపికొండల అందాలను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆదివారం బోటులో ఎక్కాం. మధ్యాహ్నం భోజనం చేద్దామని బోటు కింది అంతస్తుకు చేరుకున్నాం. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఉన్నట్టుండి బోటు డ్రైవర్ గోదావరిలో దూకేశాడు, అతని వెనుకనే నేనూ దూకేశా. మా వాళ్లు లోపల ఉండిపోయారు. గిరిజనులు పడవలు వేసుకొచ్చి నన్ను ఒడ్డుకు చేర్చి కాపాడారు. మా వాళ్లు ఎక్కడున్నారో? తెలియడం లేదు. – తాలిబ్ మజర్‌ఖాన్ జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఇంకేముందిలే జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. ఆదివారం కదా.. అని పాపికొండల అందాలను చూసేందుకు మా అన్న కుమారుడు విష్ణుకుమార్ వచ్చాడు. ప్రమాద విషయం తెలిసి నేను ఇక్కడకు వచ్చాను. ఏ వైపు నుంచి అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నా. – వేపాకులు నాగేశ్వరరావు,నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా చివరి నిమిషం వరకూ సహాయక చర్యలు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తాం. ఘటన స్థలాన్ని పరిశీలించాం. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ కమిషనర్ అనురాధ తొలుత బోటు బయటికి తీస్తే అందులో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై స్పష్టత వస్తుంది. బోటు 300 అడుగుల కంటే లోతులో ఉండటంతో బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసం మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. అప్పుడే మరికొందరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించాల్సి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు.. సమన్వయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బందాన్ని రంగంలోకి దింపాం. – అనురాధ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ -
రైతులకు శఠగోపం!
⇒పంటల బీమాతో పెట్టుబడి రాయితీ ముడి ⇒రూ.500 కోట్లు నష్టపోనున్న అన్నదాతలు ⇒అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.370 కోట్లు నష్టం అమరావతి: రాష్ట్రంలో కరువుబారిన పడి అల్లాడుతున్న రైతుల నెత్తిన మరోమారు శఠగోపం పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి అన్నదాతలకు రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా మొండిచేయి చూపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి ఇచ్చేందుకు అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల కరువుకు మారుపేరైన రాయలసీమ రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది.ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లకుపైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. హక్కులను హరించడమే పంటల బీమా, పెట్టుబడి రాయితీని ముడిపెట్టడ మంటే రైతుల హక్కులను హరించడమే. రైతులు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేసుకుంటే వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంట దెబ్బతింటే మళ్లీ సాగు చేసుకోవడానికి చట్టబద్ధంగా ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రెండింటినీ పొందే హక్కు రైతులకు ఉంది. అయితే, పంట కోల్పోయిన రైతులకు ఏదైనా ఒకదాని కిందే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోకపోతే ఈ ఏడాది రైతులకు జరిగే నష్టం రూ.500 కోట్లు. ఇది ఈ ఏడాదికే పరిమితం కాదు. ఏటా రైతులు ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని పేర్కొంటున్నారు. హెక్టార్‌కు గరిష్టంగా రూ.15,000 ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టార్‌కు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో రాయలసీమలో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎండిపోయింది. బీమా కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టార్‌కు గరిష్టంగా రూ.16,000 చెల్లించాలని లెక్కగట్టారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టార్‌కు రూ.15,000 చొప్పున చెల్లించాలని నివేదికలు రూపొందించింది. ఒక రైతుకు పంటల బీమా హెక్టార్‌కు రూ.11,000 వచ్చిందనుకుంటే దానికి రూ.4,000 పెట్టుబడి రాయితీ కలిపి రూ.15,000 చెల్లిస్తారు. బీమానే రూ.15,000 వస్తే పెట్టుబడి రాయితీ అస్సలు ఇవ్వరు. పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతుందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు. రూ.576 కోట్ల పంటల బీమా మంజూరైనప్పటికీ ఇంకా రైతులకు చెల్లించకపోవడానికి కారణం పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టాలని నిర్ణయించడమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాట మార్చిన చంద్రబాబు నాయుడు హరియాణా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని ముఖ్యమంత్రుల సాధికార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీతో సంబంధం లేకుండా హెక్టార్‌కు రూ.15,000 నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు 2010లో హైదరాబాద్‌లో దీక్ష చేశారు. దీనికి జాతీయ స్థాయి నేతలను సైతం ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అంశాన్ని మర్చిపోయారు. పైపెచ్చు పంటల బీమా, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టారు. రెతన్నలకు అన్యాయం చేస్తున్నారు. వేర్వేరుగానే ఇవ్వాలి.. ‘‘ప్రస్తుత విధానం ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీ, పంటల బీమాను వేర్వేరుగానే ఇవ్వాలి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పెట్టుబడి రాయితీని పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న పెట్టుబడి రాయితీ సాగు ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఖర్చులకు సమానంగా పెట్టుబడి రాయితీని నిర్ధారించాలి. పెట్టుబడి రాయితీ, పంటల బీమాను కలిపేయొద్దు’’ – రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు ‘‘పంట నష్టపోగానే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రైతులు ప్రీమియం చెల్లించినందుకు వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నందుకు ఇవ్వాల్సింది నష్ట పరిహారం. నష్ట పరిహారం ఎటూ ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచో వేర్వేరుగా ఇస్తున్న పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలిపేసి, రైతులకు ఒక్కటే ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. పెట్టుబడి రాయితీ గురించి అడిగితే వారంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు