ఉచిత పంటల బీమాకు కూటమి సర్కారు మంగళం
రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతి అమలు
13 దిగుబడి ఆధారిత, రెండు వాతావరణ ఆధారిత పంటలకు వర్తింపు
మామిడికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం
44.75 లక్షల ఎకరాల్లో సాగయ్యే నోటిఫైడ్ పంటలకు వర్తింపు
ప్రీమియం మొత్తంలో రైతుల వాటా ముందుగా చెల్లిస్తేనే బీమా కవరేజీ
ప్రీమియం మొత్తం మినహాయించుకుని రుణాలు ఇవ్వనున్న బ్యాంకులు
రుణాలు తీసుకోలేని రైతులు ఎన్‌సీఐపీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సిందే
పంటల బీమా పథకం అమలులోనూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను దగా చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రైతుల వెన్ను విరుస్తోంది. రబీ సీజన్ నుంచి వలంటరీ ఎన్‌రోల్‌మెంట్ మోడల్ (స్వచ్ఛంద నమోదు పద్ధతి)లో పంటల బీమాను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనతో తమకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాము సాగు చేసిన పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకు రావాలంటే ప్రీమియం వాటా మొత్తం చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారనుంది. - సాక్షి, అమరావతి
రబీలోనే రూ.300 కోట్ల భారం
రైతులకు ఎంతో మేలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులను భాగస్వామ్యం చేస్తూ పంటల బీమాను అమలు చేయబోతున్నట్టు తొలి సమీక్షలోనే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమయంలేని కారణంగా ఖరీఫ్ సీజన్ వరకు ఈ–పంట నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను కొనసాగించాలని, రబీ 2024–25 సీజన్ నుంచి వలంటరీ ఎన్‌రోల్‌మెంట్ మోడల్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఖరీఫ్‌లో 15 దిగుబడి ఆధారిత, 7 వాతావరణ ఆధారిత పంటలకు ఉచిత బీమా కవరేజీ కల్పించగా, రబీలో 11 దిగుబడి ఆధారిత, 2 వాతావరణ ఆధారిత పంటలకు వలంటరీ ఎన్‌రోల్‌మెంట్ మోడల్ కింద బీమా కవరేజీ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అదనంగా మామిడికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రబీ సీజన్ వరకు నోటిఫై చేసిన పంటలు 44.75 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం (8 శాతం)లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు గరిష్టంగా ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.6 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇలా ఒక్క రబీ సీజన్‌లోనే రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడతుందని అంచనా వేస్తున్నారు.
వెన్నుదన్నుగా ఉచిత పంటల బీమా
గతంలో ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. అయితే, బ్యాంకుల నుంచి రుణాలు పొందని రైతులు ప్రీమియం భారం అధికంగా ఉండటం, ఆర్థిక స్తోమత, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫలితంగా రైతుల్లో అత్యధికులు బీమా చేయించుకోలేక విపత్తుల వేళ పంటలకు పరిహారం దక్కక నష్టపోయేవారు.
ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు.
ఇలా గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించారు. ఏటా సగటున 40.5 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ కల్పించారు. రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించగా.. ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం పొందగలిగారు.
ఎన్‌రోల్‌మెంట్ ఎలాగంటే..
రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే ముందు తాము సాగు చేసే పంటల వివరాలను తొలుత ఎన్‌సీఐపీ (జాతీయ పంటల బీమా పోర్టల్)లో ఎన్‌రోల్ చేస్తారు. ఆయా పంటలకు కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో రైతులు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకుని మిగిలిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆ మొత్తాన్ని బీమా కంపెనీలకు జమ చేస్తాయి.
ఇక రుణాలు తీసుకోని (నాన్ లోనీ ఫార్మర్స్) మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలతో కామన్ సర్విస్ సెంటర్స్ (సీఎస్‌సీ), బ్యాంక్ బ్రాంచీలు, ఐసీ అపాయింట్‌మెంట్ చేసిన వ్యక్తుల ద్వారా లేదా వ్యక్తిగతంగా ఎన్‌సీఐసీ పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. భూ యజమానులైతే ల్యాండ్ డాక్యుమెంట్స్, కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ వీఏఏ/వీహెచ్‌ఏ/వీఎస్‌ఎలు జారీచేసే సర్టిఫికెట్లు ఉండాలి.
రైతుల మొబైల్ నంబర్, ఆధార్‌తో సీడింగ్ అయిన బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీలను అప్లోడ్ చేయాలి. రబీ సీజన్‌లో వరి మినహా మిగిలిన నోటిఫైడ్ పంటలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్‌రోల్ చేసుకోవాలి. జీడిమామిడికి నవంబర్ 15వ తేదీ, టమాటాకు డిసెంబర్ 15వ తేదీ వరకు, వరికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు.
కటాప్ తేదీకి 7 రోజులు ముందుగా ఆప్షన్ మార్చుకుంటూ డిక్లరేషన్ ఇవ్వొచ్చు. బీమా చేయించుకునే పంటను మారుస్తున్నట్టయితే కటాప్ డేట్‌కు రెండు రోజులు ముందుగా చెప్పాలి. చలానా మొత్తాన్ని 15 రోజులు ముందుగా చెల్లించాలి. అలాగే 15 రోజులు ముందుగా రిజెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
రైతులను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజంవ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు రైతులకు మేలు చేస్తారనుకోవడం భ్రమే. ఎన్నికల్లో అనేక హామీలతో రైతులను మభ్య పెట్టడం, అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా ముంచడం చంద్రబాబుకు అలవాటే.
ఇప్పుడూ రైతు వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. అన్నదాతలపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్లు విజయవంతంగా అమలు చేసిన వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. ఈ కుట్రలో భాగంగానే పంటల బీమాపై అధ్యయనం కోసం కేడినెట్ సబ్ కమిటీ వేశారు.
ప్రభుత్వ సూచన మేరకే సబ్ కమిటీ రైతులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే అత్యుత్తమ పథకమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలూ ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించింది. ఇలాంటి అద్భుత పథకాన్ని ఎత్తివేయడం రైతులను నట్టేట ముంచడమే.
జగన్‌పై కోపాన్ని రైతులపై చూపొద్దు
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్‌పై ఉన్న కోపాన్ని రైతులపై చూపడం నైతికత అనిపించుకోదు. ఉచిత పంటల బీమాను ఎత్తేసి, రైతులే ప్రీమియం కట్టుకోవాలనడం అన్యాయం. కూటమి హామీ ఇచ్చిన మేరకు రైతులకు రూ.20 వేలు ఇవ్వకపోగా, పంటల బీమా ప్రీమియం భారాన్ని కూడా వేయడం బాధాకరం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు రూ. వందల కోట్ల లబ్ధి కలిగింది. – వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రైతులపై పెనుభారం
వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.3,411 కోట్లు పంటల బీమా పరిహారంగా చెల్లించింది. సుమారు 30.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు పేరుతో కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాను ఎత్తివేసి, అన్నదాతపై భారం వేయడం దుర్మార్గమే. దీనివల్ల ఖరీఫ్‌లో వరి రైతులు ఎకరాకు రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులపై పెనుభారమే. – కొవ్వూరి త్రినాధ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రైతును ఆదుకొనే పథకాన్ని ఎత్తివేస్తారా?
కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఉచిత పంటల బీమా పథకం ఎంతో ఆదుకుంది. అలాంటి మంచి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. రైతులను ఆదుకొని, ఆత్మహత్యలు నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చింది. అన్ని పంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఇప్పుడీ పథకాన్ని చంద్రబాబు నిలిపివేయడంతో జిల్లా రైతాంగంపై రూ.110 కోట్ల భారం పడుతుంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment