చీపురుపల్లి రూరల్/భోగాపురం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర బృందం సభ్యు డు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డెరైక్టర్ పి.గౌరీశంకర్ భరోసా ఇచ్చా రు. గత నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్ర బృందం చీపురుపల్లి మండలం జి.ములగాం, కరకాం గ్రామాల్లో పర్యటించింది. పాడైన పత్తి, బొప్పారుు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, 30 ఏళ్లు వ్యవసాయం కూడా చేసినందున రైతు కష్టం తెలుసునని చెప్పారు.
రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా పంట నష్టం క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని నియమించిందన్నారు. బృందంలో తనతో పాటు సీఈఎస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డ్రింకింగ్ వాటర్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ వి.కె.భట్ ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ 50 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని పెట్టిన నిబంధన కారణంగా చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. హెక్టారును ఒక యూనిట్‌గా చేసి నష్టాన్ని అంచనా వేసేలా నివేదిక అందజేయాలని కోరారు. మండలంలో నాలుగు వందల హెక్టార్లలో బొప్పాయి పంట పాడైనా నేటికీ పరిహారం అందలేదని జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు.
ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. 4124 హక్టార్లలో వరి, 2641హెక్టార్లలో మొక్కజొన్న, 9025 హెక్టార్లలో పత్తి, 79 హెక్టార్లలో చెరుకు, 420 హెక్టార్లలో పెసర, 355 హెక్టార్లలో మినప, 140 హెక్టార్లలో కొర్రా, 51 హెక్టార్లలో చోడి, 233 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. అనంతరం ములగాంలో వర్ష బీభత్సానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను బృందం పరిశీలించింది. అంతకుముందు కేంద్ర బృందం భోగాపురం మండలం రావాడ గ్రామంలో పర్యటించింది. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను సభ్యులు పరిశీలించారు. కల్వర్టులు, రోడ్లు కోతకు గురైన విషయూన్ని ఎంపీ ఝాన్సీ కేంద్ర బృందానికి వివరించారు. ఇళ్లను ప్రభుత్వమే నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎంపీ వద్ద మొరపెట్టుకున్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ పి.శోభ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్‌డీఓ వెంకటరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయ జేడీ లక్ష్మణదాస్, స్టేట్ కన్సల్టెంట్ ఎన్‌డీఆర్.శర్మ, మండల ప్రత్యేకాధికారి పి.బాంధవరావు, చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్, ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, ఏఓ ఎస్.రవీంద్రనాద్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, భోగాపురం తహశీల్దార్ రాజకుమారి, ఎంపీడీఓ ఎన్.సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, సర్పంచ్ నిడిగొట్టు పైడినాయుడు, దంతులూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత రైతులను ఆదుకుంటాం
Published Wed, Nov 20 2013 4:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement