జిల్లాలో రేపు కేంద్ర కరువు బృందం పర్యటన
Published Sun, Jan 22 2017 11:32 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని పరిశీలించేందుకు మంగళవారం కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ జేకే రాథోడ్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పంటల పరిస్థితి, రైతుల కష్టాలు, తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత తదితర అంశాలను అధ్యయనం చేయనుంది. కేంద్ర బృందం పర్యటన క్రమాన్ని జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది.
సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించే కరువు బృందం మంగళవారం 11.15 గంటలకు ఆలూరు మండలానికి చేరుకుంటుంది. ఎ.గోనేహల్‌లో కరువు రైతులతో ముఖాముఖిగా చర్చిస్తుంది. తర్వాత ఆదోని మండలం ధనాపురం చేరుకుంటుంది. ఆదోనిలో మధ్యాహ్నం భోజనం తీసుకున్న అనంతరం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామాల్లో పర్యటించి ఎండిన చెరువులను పరిశీలించడంతో పాటు కరువు తీవ్రతపై రైతులతో చర్చిస్తుంది. సాయంత్రానికి స్టేట్‌గెస్ట్ హౌస్‌కు చేరుకొని అక్కడ కరువు పరిస్థితిపై వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తుంది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఇతర శాఖల అధికారులతోను ప్రజాప్రతినిధులతోను కరువుపై చర్చిస్తారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీకి వెళ్తుడటంతో కేంద్రబృందం వెంట జాయింట్ కలెక్టర్ హరికిరణ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఈ బృందం వెంట ఉంటారు. 5.30 గంటలకు కేంద్ర బృందం విజయవాడ వెళ్తోంది.
Advertisement