ఉదారంగా ఆదుకోండి | Farmers suffered a lot due to the toofan | Sakshi
Sakshi News home page

ఉదారంగా ఆదుకోండి

Published Thu, Dec 14 2023 5:17 AM | Last Updated on Thu, Dec 14 2023 3:50 PM

Farmers suffered a lot due to the toofan - Sakshi

సాక్షి, అమరావతి/పామర్రు/గుడివాడ/కంకిపాడు: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ–విపత్తుల నిర్వహణ శాఖ) సాయిప్రసాద్‌ కేంద్ర బృందానికి విన్నవించారు.

తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో బుధవారం తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులతో కలిసి సాయిప్రసాద్‌ సమావేశమయ్యారు. తుపాను తీవ్రతతో కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందానికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు.  

వీలైనంత మేర ఆదుకోవడానికి సహకరిస్తాం: కేంద్ర బృందం 
కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపాను­తో తీవ్రంగా ప్రభావితమైన నాలుగు జిల్లాల్లో దెబ్బ­తిన్న ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ కేంద్ర బృందానికి వివరించారు.

శాఖాపరంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.2,641 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.703 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.100 కోట్లు, ఉద్యా­న శాఖకు రూ.86.97 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తంగా మిచాంగ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని విన్నవించారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లింది. గురువారం కూడా ఈ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి­ంచనుంది.  

రైతులకు న్యాయం చేస్తాం.. 
రాష్ట్రంలో పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పామర్రు, కంకిపాడు, గుడివాడల్లో కేంద్ర బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. గుడివాడ మండలం రామనపూడి, వలిపర్తిపాడు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది.

అలాగే పామర్రు మండలం నెమ్మలూరు, కొరిమెర్ల తదితర గ్రామాల పరిధిలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ తదితరులతో కలిసి రాజేంద్ర రత్నూ పరిశీలించారు. నెమ్మలూరులో కౌలు రైతు ఆత్మూరి రామ కోటేశ్వరరావు కేంద్ర బృందంతో మాట్లాడుతూ సాగు చేస్తున్న 40 ఎకరాలలోని వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పంట కాలువలు, మురుగు డ్రెయిన్‌ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఏటా పంట నష్ట పోవాల్సి వస్తోందని దీనికి  శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు కేంద్రం బృందానికి అర్జీలను సమర్పించారు. మొత్తం 1,270 ఎకరాల సాగులో 1,040 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. జేసీ అపరాజితాసింగ్‌ స్థానికంగా జరిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, కైలే అనిల్‌ కుమార్, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

నేడు దెబ్బతిన్న ధాన్యం పరిశీలన
తుపాను దాటికి దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర పౌరసరఫరాల శాఖ సాంకేతిక బృందం గురువారం నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పంట కోసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ధాన్యంలో విరిగిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం నమూనాలను సేకరించనుంది.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సహాయకులను ఎంపిక చేసింది. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది.

ఈ క్రమంలో తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని సైతం సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. వర్షాలు తగ్గడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement