సమయమూ కరువేనా..
మొక్కుబడిగా సాగిన కేంద్ర బృందం పర్యటన
మండలాల సంఖ్య కుదింపు
పశ్చిమాన నామమాత్రంగా...
ఆలస్యంగా ప్రారంభించి వడివడిగాముగించుకున్న వైనం
జిల్లాలో కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం నిరాశ మిగిల్చింది. పంట నష్టంతో దిగాలు పడిన అన్న దాతకు బృందం పర్యటన తీరు భంగపాటు కలిగించింది. వచ్చాం.. వెళ్లాం.. అనే రీతిలో వీరి పర్యటన సాగడం విమర్శలకు దారితీసింది. సోమవారం ఆలస్యంగా ప్రారంభించి ఆదర బాదరాగా రెండు మూడు మండలాల్లో మొక్కుబడిగా తిరిగి పర్యటన అయ్యిందనిపించారు. కరువు కరాళ నృత్యం చేస్తున్న పశ్చిమ మండలాల్లో నామమాత్రంగా పర్యటించడం అక్కడి రైతాంగాన్ని బాధించింది. కరువు జాబితాలో లేని మండలాన్ని పర్యటించడం కొసమెరుపు. పర్యటించాల్సిన మండలాల షెడ్యూలును కూడా కుదించేసుకుంటూ బృందం వడివడిగా వైఎస్సార్ జిల్లాకు పయనమైపోయింది.
చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో నెలకొన్న కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ఆదరాబాదరాగా సాగింది. సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సిన పర్యటన ఆఖరి నిముషంలో మార్పు చేశారు. దీంతో పలు మండలాల పర్యటనను రద్దుచేసి, నామమాత్రపు పరిశీలనకు శ్రీకారం చుట్టారు. కరువు ఎక్కువగా ఉన్న పడమటి మండలాల్లో పొద్దుపోయాక తిరిగామనిపించారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న బృందం సోమవారం చెన్నై నుంచి వచ్చినట్లు భ్రమింపజేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 9.45 గంటలకు చిన్నగొట్టిగల్లు నుంచి బృందం పర్యటన సాగాలి. సాయంత్రం 4 గంటల వరకు 9 మండలాల్లో కరువును పరిశీలించాల్సి ఉంది. అయితే ఆది వారం మధ్యాహ్నం జిల్లాకు వచ్చిన అధికారుల బృందం నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. సోమవారం ఉదయం ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను బాగా కుదిం చేసింది. దీంతో ఈ బృందం మధ్యాహ్నానికి తూర్పుప్రాంతంలోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించి తిరుపతికి చేరుకుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు చిన్నగొట్టిగల్లు మండలం చేరుకుని అక్కడి పరిస్థితులను చూసింది.
తరువాత రొంపిచెర్ల , పీలేరు మండలం వద్దకు చేరుకునే సమయానికే పొద్దుపోయింది. అక్కడ నుంచి కలికిరి, కలకడ మండలాలకు వెళ్లింది. చీకట్లో తూతూ మంత్రంగా పర్యటన చేపట్టి వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయింది. కరువు బృందం ఆదివారం మధ్యాహ్నానికే తిరుమలకు చేరుకున్న విషయం సోమవారం అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ బృందం తిరుమల నుంచి నేరుగా నెల్లూరు జిల్లా తడకు చేరుకుంది. అక్కడి నుంచి మధ్యాహ్నానికి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఈ బృందం చెన్నై నుంచి వచ్చినట్లు చెప్పుకోవడం గమనార్హం. జిల్లాలో కరువు తాండవిస్తున్న పడమటి మండలాల్లో కరువు బృందం పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం చిన్నగొట్టిగల్లు నుంచి కలకడ వరకు 9 మండలాల్లో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించింది. సోమవారం ఉదయం హడావుడిగా షెడ్యూల్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న బృందం కరువు లేని తూర్పు ప్రాంతాల్లోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించడం విస్మయం కలిగించింది. తిరుపతిలో ఫొటో ఎగ్జిబిషన్ చూసి సాయంత్రం కరవు పర్యటనకు శ్రీకారం చుట్టింది. సమయం తక్కువగా ఉండటంతో మార్గం మధ్యలోని నాలుగు మండలాలను మాత్రం పరిశీలించకుండా వైఎస్‌ఆర్ జిల్లాకు వెళ్లిపోయింది. తమ ప్రాంతాలకు కరువు బృందం వస్తుంది... అంచనాలు వేస్తుంది... తమకేదో లాభం చేకూర్చుతుందని భావించి ఆశగా ఎదురుచూసిన కురబలకోట, మదనపల్లె ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. ఆఖరు నిమిషంలో బృందం తమ మండలాలకు రావడం లేదని తెలియడంతో రైతులు నిరుత్సాహపడ్డారు. బృందం పర్యటించిన మండలాల రైతులు కూడా ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు పొలాల్లోనే పడిగాపులు కాశారు. తరువాత చీకట్లో వెళ్లిన బృందం గ్రామాల్లోని రైతులతో పలకరించి వెళ్లిపోయింది.
కరువు విలయతాండం
రొంపిచెర్ల(పుంగనూరు): రొంపిచెర్ల మండలంలో తీవ్ర వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను సోమవారం కేంద్ర కరువు బృందం పరిశీలించింది. బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు సమీపంలోని వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులను విచారించింది. ఐదేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తోందని రైతులు అధికారులకు తెలిపారు. పశువులకు గ్రాసం కూడా లేదనీ, చెరువులు ఎండిపోవడంతో పశువులకు తాగునీరు కూడా దొరకడం లేదని వివరించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు.
వెయ్యి అడుగులు డ్రిల్‌చేసినా నీరు లేదు
కలికిరి(పీలేరు): వెయ్యి అడుగుల లోతు కంటే ఎక్కువగా బోర్లు డ్రిల్ చేసినా నీరు పడడం లేదని కలికిరి మండల ప్రజలు కరువు బృందానికి తెలిపారు. మేడికుర్తి పంచాయతీలోని సుల్తాన్ చెరువును సోమవారం సాయంత్రం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాలను ఈ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విన్నవించారు.
రుణాలు మాఫీ చేయండి
వరదయ్యపాళెం (సత్యవేడు): ఇటు వరాభావ పరిస్థితులు.. అటు చెరువులకు చేరని తెలుగు గంగ నీటితో రెండేళ్లుగా పంటలు చేతికందలేదని వరదయ్యపాళెం మండల రైతులు కేంద్ర కరువు బృందానికి తెలిపారు. కేంద్ర బృందం సోమవారం ఉదయం మండలంలోని కడూరులో పర్యటించింది. ఈ సందర్భంగా తమకు వ్యవసాయరుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని రైతాంగం మొరపెట్టుకుంది.
తిరుపతిలో ఫోటో ప్రదర్శన పరిశీలన
తిరుపతి (అలిపిరి) : జిల్లాలో కరువు పరిస్థితులపై తిరుపతి ఆర్ అండ్ బీ అతిథి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సోమవారం ఉదయం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కరువు మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని జిల్లా అధికారులను ప్రశ్నించింది.