నష్టం అంచనాకు కేంద్ర బృందం
నష్టం అంచనాకు కేంద్ర బృందం
Published Wed, Sep 28 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
తెనాలి: భారీ వర్షాలకు కలిగిన నష్టం అంచనాకు కేంద్రం బృందం త్వరలోనే వస్తుందని, తగిన నివేదిక ఇచ్చిన వెంటనే తప్పక ఆదుకొంటామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక్కడి చావాస్ గ్రాండ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రకృతి విపత్తు నిధులు రూ.300 కోట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ముందు వినియోగిస్తూ తర్వాత మిగతా నిధులు కేటాయించుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1142 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని కోసం డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టు లేదన్న అభ్యంతరాలను ఖాతరు చేయకుండా విజయవాడ, గుంటూరులో కొన్ని పథకాల కోసం రూ.1000 కోట్లను మంజూరు చేయించినట్టు వెంకయ్యనాయుడు వెల్లడించారు. గన్నవరం– విజయవాడ– అమరావతి మధ్య మెట్రో రైలు, గుంటూరు– అమరావతి మధ్య షటిల్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాజధానికి 168 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డును కేంద్రమే నిర్మిస్తుందని తెలిపారు. తాగునీరు, మురుగునీటి పథకాలకూ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కేవలం 18 నెలల్లోనే కేంద్రం 8 ఉన్నత విద్యా సంస్థల్ని 13 జిల్లాల్లో ఏర్పాటుకు వేల కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందన్నారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, టి.అనంతాచార్యులు, డాక్టర్ పి.దక్షిణామూర్తి, దిలీప్‌రాజా మాట్లాడారు. వేదికపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రావి రవీంద్రనాథ్ ఉన్నారు.
Advertisement