
భూపాలపల్లి అర్బన్/ములుగు, ఏటూరునాగారం: ఇటీవల భారీ వరద తాకిడికి గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. భారీ వర్షాలు, వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామంలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి కలెక్టర్ భవేష్‌మిశ్రా వివరించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తూ కేంద్ర బృందం సభ్యులు బాధితులతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆ తర్వాత ములుగు జిల్లాకు చేరుకున్న బృందానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి వర్షం, వరదల నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పస్రా సమీపంలో గుండ్లవాగు వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారిని, ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ దారిని పరిశీలించారు.
సాయంత్రం ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల వరద ముంపు గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద ఉధృతి ఏ మేరకు వచ్చింది.. ఎనిమిది మంది ఎలా కొట్టుకుపోయారు.. వంటి వివరాలను సర్పంచ్ కాక వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందంలో ఎన్‌డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యారి్థ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment