
మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో సమావేశమైన కేంద్ర బృందం సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ప్రవేశపెట్టిన ‘హితం’యాప్‌ను నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ కుమార్ పాల్ అభినందించారు. పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా, రవీంద్రన్‌లతో కూడిన కేంద్ర బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌లో పర్యటించింది. పర్యటన ముగింపు సందర్భంగా బీఆర్‌కేఆర్ భవన్‌లో బృందం సభ్యులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హితం యాప్ వివరాలతో పాటు రాష్ట్రంలో కరోనా మేనేజ్‌మెంట్‌పై చేపట్టిన పనులను ఇతర రాష్ట్రాలతో షేర్ చేస్తామని వినోద్‌కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో టెస్టింగ్‌ను పెంచారని, ఇది వైరస్ నియంత్రణకు కీలకమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆస్పత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్ నివారణ చర్యలు, రోగులకు చికిత్స వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి 24 గంటలు పని చేస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్, కరోనా ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. పర్యటనలో భాగంగా కేంద్ర బృందం సోమవారం ఉదయం సీఎస్, జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో సమీక్షించారు. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సోమేశ్‌కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. టెస్టింగ్‌లను ప్రతిరోజు 40 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment