సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వేళ ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద కేంద్రంగా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చాలామంది సహజసిద్ధంగా ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించి రోగనిరోధక శక్తిని పెంచుకున్నారని పేర్కొన్నారు. శనివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమలు చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో 2,034 పోస్టులు, పీహెచ్‌సీల్లో 5,658 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రతి సబ్ సెంటర్ నుంచి పీహెచ్‌సీ వరకు అన్నీ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశించారు.
పేషంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి
ప్రతి ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ ఉండాలని, సీటీస్కాన్, పూర్తిస్థాయి ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట్ల అన్నిరకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, వాటికి వార్షిక నిర్వహణ నిధులు విడుదల చేయాలని మంత్రి అన్నారు. చికిత్స వివరాలను రోగికి, వారి బంధువులకు ఎప్పటికప్పుడు అందించాలని, అందుకు పేషంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 90 శాతం మంది పేషంట్లకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని, పెద్ద జబ్బులు ఉన్న వారు మాత్రమే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment