Ayurveda Clinic
-
కోవిడ్ వేళ ప్రతి ఇల్లూ ఆయుర్వేద కేంద్రమే
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వేళ ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద కేంద్రంగా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చాలామంది సహజసిద్ధంగా ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించి రోగనిరోధక శక్తిని పెంచుకున్నారని పేర్కొన్నారు. శనివారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆయుష్ డిపార్ట్మెంట్కు సంబంధించి గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమలు చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో 2,034 పోస్టులు, పీహెచ్‌సీల్లో 5,658 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రతి సబ్ సెంటర్ నుంచి పీహెచ్సీ వరకు అన్నీ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశించారు. పేషంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి ప్రతి ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ ఉండాలని, సీటీస్కాన్, పూర్తిస్థాయి ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట్ల అన్నిరకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, వాటికి వార్షిక నిర్వహణ నిధులు విడుదల చేయాలని మంత్రి అన్నారు. చికిత్స వివరాలను రోగికి, వారి బంధువులకు ఎప్పటికప్పుడు అందించాలని, అందుకు పేషంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 90 శాతం మంది పేషంట్లకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని, పెద్ద జబ్బులు ఉన్న వారు మాత్రమే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. -
బిస్వాస్ దాదా... బీఏఎంఎస్!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గోపాష్ భద్ర చదివించి టెన్త్... వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి చెన్నైలో ఆయుర్వేద డాక్టర్ వద్ద పని చేశాడు... ఈ ‘అనుభవం’తో హైదరాబాద్‌కు వచ్చి ‘డాక్టర్ బిస్వాస్’గా మారాడు... తన పేరు చివర బీఏఎంఎస్ అనే డిగ్రీ తగిలించుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు... ఈ నకిలీ ఆయుర్వేద డాక్టర్‌ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులు ప్రశ్నించగా... బీఏఎంఎస్ ఫుల్‌ఫామ్ చెప్పలేకపోవడంతో పాటు కనీసం అతడు ప్రింట్ చేయించిన కరపత్రాన్నీ చదవలేకపోయాడని డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపాష్ భద్ర తన స్వస్థలంలో పదో తరగతి చదివాడు. తొలినాళ్ళల్లో కోల్‌కతాలో వివిధ రకాలైన పనులు చేసుకుని జీవనం సాగించాడు. 2011లో చెన్నైకు వెళ్ళిన అతను అక్కడ బీఏఎంఎస్ పూర్తి చేసిన ఆయుర్వేద డాక్టర్ వద్ద సహాయకుడిగా పని చేశాడు. అక్కడ తన డాక్టర్ పైల్స్, ఫిషర్ తదితర వ్యాధులకు ఎలా చికిత్స చేస్తున్నారో పరిశీలించాడు. ఈ అనుభవంతో తానే ఓ బీఏఎంఎస్ డాక్టర్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రాక్టీస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుని ఇక్కడకు వచ్చాడు. తన పేరును డాక్టర్ బిస్వాస్గా పేర్కొంటూ బీఏఎంఎస్ డిగ్రీ చేసినట్లు నమ్మిస్తూ గాంధీనగర్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ‘జోతి క్లినిక్’ ఏర్పాటు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై తమ వద్ద డాక్టర్ అనిత అనే హెచ్ఏఎంస్ పూర్తి చేసిన డాక్టర్ సైతం ఉన్నట్లు చూపించాడు. చెన్నైలో నేర్చుకున్న పైల్స్, ఫిషర్ తదితర వ్యాధులకు ‘వైద్యం’తో పాటు చర్మ వ్యాధుల్నీ తగ్గిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీనికోసం కరపత్రాలు ముద్రించి జనసమర్థ ప్రాంతాల్లో పంచిపెట్టేవాడు. వీటికి ఆకర్షితులై వచ్చిన అమాయక రోగులకు వైద్యం చేయడం మొదలెట్టాడు. నెయ్యి, హెయిర్ జెల్స్, టాల్కం పౌడర్, వేప ఆకులు, కొబ్బరినూనె వినియోగించి తానే కొన్ని ఆయుర్వేద ఔషధాలను తయారు చేశాడు. వీటినే రోగులకు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్‌కుమార్, జి.తిమ్మప్ప గురువారం జోతి క్లినిక్‌పై దాడి చేశారు. నకిలీ డాక్టర్ బిస్వాస్‌ను అరెస్టు చేయడంతో పాటు అనేక నకిలీ ఆయుర్వేద మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బీఏఎంఎస్ డిగ్రీకి ఫుల్‌ఫామ్ ఏమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నీళ్ళు నమిలాడు. అతడు ముద్రించిన కరపత్రాలను చూపించి చదవమంటే తడబడ్డాడు. ఇలాంటి వ్యక్తి ఆరు నెలలుగా అనేక మందికి వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. నకిలీ డాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. -
సాటిలేని వైద్యం.. ఆయుర్వేద భాగ్యం
ప్రకృతి మనిషిని సృష్టిస్తే... మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. ఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుంటూ ప్రకృతి శరణు వేడుకుంటున్నాడు. అదే క్రమంలో తిరిగి తెరపైకి వచ్చింది...ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతం... ఆయుర్వేదం. వైద్య విధానాలు వెల్లువెత్తుతున్న ఆధునిక కాలంలో... ఈ సనాతన భారతీయ సంప్రదాయ ఆరోగ్య ప్రదాయిని... నగరవాసుల పాలిట సహజ ప్రత్యామ్నాయంగా మారి ఆయుర్వేద ఉత్పత్తులు, వైద్యవిధానాలు, ఆసుపత్రుల బాట పట్టేలా చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో:సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. సూర్యాస్తమయంలోగా భుజించడం పూర్తి కావాలి. పరిమితంగా తినాలి. శారీరకశ్రమ తప్పనిసరిగా ఉండాలి. ఇది ఆయుర్వేదం చెప్పే జీవన విధానం. ఆధునిక హైదరాబాద్‌కు అనారోగ్య భాగ్యం ప్రాప్తిస్తున్న పరిస్థితుల్లో చక్కని జీవనవిధానాన్ని సూచించే ఆయుర్వేదాన్ని అనుసరించడం అవసరం ఎంతైనా ఉందంటారు. ఈ తరహా జీవనశైలిని అనుసరిస్తే వీటిలో అత్యధిక శాతం జబ్బులు అసలు రాకుండానే నివారించవచ్చు. నైట్‌లైఫ్ బాగా పెరగడం వల్ల, నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి, తద్వారా హోర్మోన్ల అసమతౌల్యం వంటివి రోగాలకు కారణమవుతున్నాయని, దీనిని వెంటనే సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత ఆధునిక వైద్యాల ద్వారా రోగాల నుంచి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేనందున, ఆయుర్వేదంపై నగరవాసుల్లో అవగాహన పెరగాల్సి ఉందన్నారు. పుస్తకాలు.. ఆరోగ్య నేస్తాలు ఆత్మ, ఇంద్రియాలు, మనసు.. ఈ మూడూ ప్రసన్నంగా ఉండడమే ఆరోగ్యం. మనుషులను 7 రకాలుగా విభజించి ఎలాంటివారు ఏం చేయాలి? ఏ సీజన్లో ఎలాంటివి తిని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో శాస్త్రం సూచించింది. ఇవన్నీ ఆయుర్వేద గ్రంధాల్లో వివరంగా ఉందంటున్నారు శాస్త్ర నిపుణులు. వీటిని చదవడం ప్రతి ఒక్కరికీ అవసరమంటున్నారు. వైద్య విధానం ఇదీ.. అస్తవ్యస్త జీవనశైలి కారణంగా అంతర్గత, బాహ్య శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్, ప్రీ రాడికల్స్‌తో శరీరంలోని మెటబాలిజం డిస్ట్రబ్ అయిపోతుంది. వీటిని తొలుత పంచకర్మలు ద్వారా బయటకు పంపిస్తారు. తర్వాత ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ అంటే అశ్వగంధ, యష్టి మధు, అమృత, షడ్గుణ సింధూరం.. వంటివి వినియోగించి దేహాన్ని శుద్ధి చేస్తారు. కొన్ని రకాల జీవనశైలులను, ఆహార వ్యవహారాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మన రక్షణ వ్యవస్థే శత్రువుగా.. నగరవాసులను వేధిస్తున్న ఆరోగ్యసమస్యల్లో ప్రధానమైనవి డిప్రెషన్, అలర్జీ, అస్తమా వంటి శ్వాసకోస వ్యాధులు, డయాబెటిస్, రక్తపోటు, ఒబెసిటీ.. ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’ పేరిట కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. మన రోగ నిరోధక శక్తి మనమీదే దాడి చేయడమే ఈ డిజార్డర్స్. ఉన్నట్లుండి చెవులు వినపడకపోవడం, కళ్లు కనపడకపోవడం ఇలాం టివే. అలాగే కొన్ని రకాల ఆర్థ్రరైటిస్, సొరియాసిస్.. ఇలా దాదాపు 100 రకాల జబ్బులకు ఇది కారణమవుతోంది. దీనికి అస్తవ్యస్తంగా మారిన జీవన విధానమే ప్రధాన కారణం. వీటిని ఎదుర్కునేందుకు వినియోగిస్తున్న స్టెరా యిడ్స్ పూర్తిగా రోగ నిరోధక శక్తిని ధ్వంసం చేసి, ఇతర దుష్పలితాలకు దారి తీస్తాయి. -
ఉపవాసం ఎందుకు చేస్తారు?
మనిషి కడుపు నిండా తినడం అనారోగ్యం. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే పొట్టను నాలుగు భాగాలు అనుకుంటే రెండు భాగాలు ఆహారంతో, ఒక భాగం నీటితో నింపి, ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలని. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అయితే, ఈ సూత్రాన్ని అందరూ పాటించరు. అందుకే వారానికోసారి ఒకటి లేదా రెండు పూటలు ఉపవాసం ఉంటే ఆ రోజు ఒంట్లో ఉన్న అధిక కేలరీలను, కొవ్వును శక్తిగా మార్చుకుని శరీరం ఉపయోగించుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఉపవాసాలు చెయ్యాలని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి రెండు పూటలు ఉపవాసం ఉన్నాం కదా అని మూడో పూట కడుపును నింపేస్తే ప్రయోజనం శూన్యం. ఎంత ఉపవాసం ఉన్నా పొట్టబరువెక్కేలా తినకూడదు. మితాహారం, ఉపవాసం వల్ల మనిషి నిత్య యవ్వన శక్తితో, ఆరోగ్యంతో ఉంటాడు. ఊరంతా చుట్టాలే, ఉండటానికి తావు లేదు ! మనుషులు జీవితంలో కొన్ని భ్రమల్లో బతుకుతుంటారు. అలా కాకుండా వాస్తవంలో జీవించాలి. లేకపోతే అనేక కష్టాలు ఎదుర్కొంటారన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూనే స్వశక్తిని నమ్ముకోవాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ‘ఎంతోమంది మనల్ని నిత్యం పలకరిస్తుంటారు కాబట్టి చాలా పరిచయాలున్నాయి, వారంతా ఆపదలో ఆందుకుంటారులే అనుకుని భ్రమల్లో ఉండకూడదు. అసలు కష్టాలు సమస్యలు వచ్చినపుడు నీతో ఉండేవారు ఎవరు అన్నది నీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నీ నీడ కూడా ఒక్కోసారి నీతో ఉండదు... నువ్వు చీకట్లో ఉంటే. అందుకే నీ శక్తిని, నీ యుక్తిని నమ్ముకుంటే జీవితంలో బాగు పడతావు, పైకి వస్తావు. ఇతరుల మీద ఆధారపడి అంతా నావాళ్లే అనుకుని కలల్లో బతికితే కష్టం వచ్చినపుడు చిక్కుల్లో పడతావు’ అన్నది సామెత వివరణ. -
ముఖమంతా మొటిమలు... తగ్గినచోట మచ్చలు..?
నా వయసు 19. గత సంవత్సరకాలంగా ముఖం మీద మొటిమలతో బాధపడుతున్నాను. చూడటానికి ఇబ్బందిగా ఉంది. అవి తగ్గినచోట చిన్న చిన్న గుంతలు, మచ్చలు ఏర్పడ్డాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇవి పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - రమాదేవి, డోర్నకల్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ యుక్తవయసులో వచ్చే సాధారణ సమస్య ఇది. దీనిని ఆయుర్వేదంలో ‘తారుణ్యపిడిక లేక యవ్వన పిడిక’ అనే పేరుతో వర్ణించారు. మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వీటిని బలవంతంగా చిదపటానికి ప్రయత్నించవద్దు. నీళ్లు ఎక్కువగా తాగండి. కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్సులు లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు మునగాకు, మునగకాడలు, ఆకుకూరలు, నువ్వులు, ఎండుఫలాలు, శాకాహారం మొదలైనవి. కాలానుగుణంగా లభించే తాజాఫలాలు (జామ, దానిమ్మ, బత్తాయి మొదలైనవి) బాగా తినండి. ముఖ శుభ్రతకు సబ్బులకు బదులు సున్నిపిండి లేదా శనగపిండి వాడండి. రోజూ రెండుపూటలా ప్రాణాయామం చెయ్యండి. తగినంత శారీరక వ్యాయామం కూడా అవసరం. ఔషధం : గంధకరసాయన (మాత్రలు) : ఉదయం - 2, రాత్రి - 2 (పరగడుపున) ఆరోగ్యవర్ధని (మాత్రలు) : ఉదయం - 1 రాత్రి - 1 (తిన్న తర్వాత) మహామంజిష్ఠాదికాఢ, శారిబాద్యాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక కప్పులో కలుపుకొని నాలుగు చెంచాల నీళ్లు కలిపి రెండుపూటలా తాగండి. కుంకుమాదిలేపం (పైపూతకు) : రాత్రివేళ పైపూతగా పూసుకోవాలి. సూచన: పింపుల్స్ పగిలి దురదగా అనిపిస్తే, అక్కడ గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, అనంతరం తులసి ఆకురసంలో కొంచెం పసుపు కలిపి, పైపూతగా పెట్టుకోండి. నా వయసు 23 ఏళ్లు. మూత్రవిసర్జన చేసినప్పుడు చాలా సన్నటిధారతో ఆలస్యంగా వస్తోంది. అంగం మీద చర్మం వెనకకు రావడం లేదు. దయచేసి ఆయుర్వేద మందులు సూచించండి. - శ్యాంబాబు, సిద్ధిపేట ఈ సమస్యని ఆయుర్వేదంలో ‘నిరుత్థ ప్రకశ’ (ఫైమోసిస్)గా అభివర్ణించారు. ఇది మందుల వల్ల తగ్గేది కాదు. మీరు సర్జన్ (శస్త్రకర్మనిపుణుడి)ని సంప్రదించండి. వారు ‘సున్తీ’ ఆపరేషన్ చేస్తారు. ఈ సమస్య శాశ్వతంగా నయమైపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్