ఉపవాసం ఎందుకు చేస్తారు?
మనిషి కడుపు నిండా తినడం అనారోగ్యం. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే పొట్టను నాలుగు భాగాలు అనుకుంటే రెండు భాగాలు ఆహారంతో, ఒక భాగం నీటితో నింపి, ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలని. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అయితే, ఈ సూత్రాన్ని అందరూ పాటించరు. అందుకే వారానికోసారి ఒకటి లేదా రెండు పూటలు ఉపవాసం ఉంటే ఆ రోజు ఒంట్లో ఉన్న అధిక కేలరీలను, కొవ్వును శక్తిగా మార్చుకుని శరీరం ఉపయోగించుకుంటుంది.
అందుకే అప్పుడప్పుడు ఉపవాసాలు చెయ్యాలని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి రెండు పూటలు ఉపవాసం ఉన్నాం కదా అని మూడో పూట కడుపును నింపేస్తే ప్రయోజనం శూన్యం. ఎంత ఉపవాసం ఉన్నా పొట్టబరువెక్కేలా తినకూడదు. మితాహారం, ఉపవాసం వల్ల మనిషి నిత్య యవ్వన శక్తితో, ఆరోగ్యంతో ఉంటాడు.
ఊరంతా చుట్టాలే, ఉండటానికి తావు లేదు !
మనుషులు జీవితంలో కొన్ని భ్రమల్లో బతుకుతుంటారు. అలా కాకుండా వాస్తవంలో జీవించాలి. లేకపోతే అనేక కష్టాలు ఎదుర్కొంటారన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూనే స్వశక్తిని నమ్ముకోవాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం. ‘ఎంతోమంది మనల్ని నిత్యం పలకరిస్తుంటారు కాబట్టి చాలా పరిచయాలున్నాయి, వారంతా ఆపదలో ఆందుకుంటారులే అనుకుని భ్రమల్లో ఉండకూడదు. అసలు కష్టాలు సమస్యలు వచ్చినపుడు నీతో ఉండేవారు ఎవరు అన్నది నీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. నీ నీడ కూడా ఒక్కోసారి నీతో ఉండదు... నువ్వు చీకట్లో ఉంటే. అందుకే నీ శక్తిని, నీ యుక్తిని నమ్ముకుంటే జీవితంలో బాగు పడతావు, పైకి వస్తావు. ఇతరుల మీద ఆధారపడి అంతా నావాళ్లే అనుకుని కలల్లో బతికితే కష్టం వచ్చినపుడు చిక్కుల్లో పడతావు’ అన్నది సామెత వివరణ.