రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్‌ఎస్‌పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది.
చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు!
చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్‌ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్‌ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది.
ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్‌గా ఉన్నప్పుడు హెచ్‌ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్‌లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్‌ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment